Andhra Pradesh : ఏపీలోని ఈ ప్రాంతాల్లో నేడు రీ పోలింగ్.. కారణాలివే.. పూర్తి వివరాలు ఇక్కడ
Andhra Pradesh : ఏపీలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ (శక్రవారం) రీ- పోలింగ్ జరగనుంది.
- Harish Thanniru
- Updated on- November 6, 2026 / 07:17 AM IST
AP Local Body Elections
Andhra Pradesh : ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి గురువారం పోలింగ్ జరిగింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ వాయిదా పడగా.. కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు, ఇతర కారణాలవల్ల రీ పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అనంతపురం, శ్రీకాకుళం, మార్కాపురం, పల్నాడు జిల్లాల్లో ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించనున్నారు.
Also Read : Free Tirumala Laddu : తిరుమల భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఉచితంగా లడ్డూ, వడ ప్రసాదం.. ఎప్పటినుంచంటే?
ఈ పోలింగ్ కేంద్రాల్లో రీ- పోలింగ్..
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం చిత్రచెడు గ్రామంలో 46, 47 నంబరు పోలింగ్ కేంద్రాల్లో, ఇదే జిల్లాల్లోని కూడేరు మండలం మారుట్ల గ్రామంలోని పోలింగ్ కేంద్రం నంబరు 8లో రీ – పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా ఆదేశించారు. కర్నూల్ జిల్లా కోసిగి మండలం ఆర్లబండ గ్రామంలో రెండో నంబరు పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం కలెక్టర్‌ను ఆదేశించింది. శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నాం గ్రామంలో రెండో నంబరు పోలింగ్ బూత్‌లో.. అదేవిధంగా.. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం గంగవరం గ్రామంలో పోలింగ్ కేంద్రం నంబరు 5లో రీ పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అండుగురు పోలింగ్ స్టేషన్ -43లోనూ రీ పోలింగ్ నిర్వహించనున్నారు.
మొత్తం ఐదు జిల్లాల్లోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో శుక్రవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రీ పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలికి (మిడిల్ ఫింగర్ ) సిరా మార్క్ వేస్తారు.
5 జడ్పీటీసీలు, 60 ఎంపీటీసీ స్థానాలకు నేడు పోలింగ్..
భారీ వర్షం కారణంగా వాయిదా పడిన రాష్ట్రంలోని ఐదు జడ్పీటీసీ, 60 ఎంపీటీసీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం, ఏలూరు జిల్లాలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు మండలాల జడ్పీటీసీ స్థానాలతో పాటు అక్కడి 60 ఎంపీటీసీ స్థానాలకు ఇవాళ (శుక్రవారం) పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు.
