Annadatha Sukhibhava Scheme : ఏపీలోని రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఒక్కో అకౌంట్లో రూ.7వేలు జమ.. పూర్తి వివరాలు ఇలా..

Annadatha Sukhibhava Scheme : ఏపీలోని అర్హులైన రైతుల ఖాతాల్లో ఈనెల 20వ తేదీన రూ.7వేలు జమకానున్నాయి. అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ యోజన పథకం 2026-27 కు సంబంధించి మొదటి విడత నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నాయి.

Annadatha Sukhibhava Scheme

  • ఏపీలోని రైతులకు శుభవార్త
  • అర్హులైన రైతుల ఖాతాల్లో జమకానున్న రూ.7వేలు
  • ఈనెల 20న విడుదల చేయనున్న మోదీ, చంద్రబాబు

Annadatha Sukhibhava Scheme : ఏపీలోని రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులైన రైతుల ఖాతాల్లో ఈ నెల 20వ తేదీన రూ.7వేలు జమకానున్నాయి. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం 2026-27 కు సంబంధించి మొదటి విడత నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నాయి.

Also Read : YS Jagan : సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలి.. డీజీపీ సహా ఆ ముగ్గురి ప్రమేయం : వైఎస్ జగన్

ఏపీలో అర్హులైన రైతులందరి బ్యాంకు ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులను జమ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 20వ తేదీన పీఎం కిసాన్ యోజన పథకం నిధులను ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తారకేశ్వర్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొని విడుదల చేస్తారు. అదేరోజు.. ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని అన్నదాత సుఖీభవ పథకం నిధులను జమ చేయనున్నారు. దీంతో రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5వేలు.. పీఎం కిసాన్ యోజన పథకం కింద రూ.2వేలు శనివారం జమకానున్నాయి.

ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం, పీఎం కిసాన్ యోజన పథకం కలిపి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతీయేటా ఏపీలోని కూటమి ప్రభుత్వం రూ.14వేలు మూడు విడతల్లో అందజేస్తోంది. పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రూ.6వేలను మూడు విడతల్లో అందజేస్తోంది. దీంతో ఏడాదికి రూ.20వేలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద ప్రభుత్వాలు జమ చేస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీలోని 46లక్షల85వేల838 మంది అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో మొత్తం రూ.3,125.47కోట్లు జమ కానున్నాయి. వీరిలో పట్టాదారు రైతు కుటుంబాలు 45లక్షల69వేల817మంది ఉంటే.. అటవీ భూసాగు హక్కుదారులు 1,16,021 మంది ఉన్నారు. రైతులకు విడుదల చేసే నిధుల్లో రాష్ట్ర వాటా కింద రూ.2,342.92కోట్లు, కేంద్ర వాటా కింద రూ.782.5కోట్లు ఉన్నాయి.