Sai Krishna Missing Case : సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విచారణకు సిట్ ఏర్పాటు

Sai Krishna Missing Case : ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఘటనలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసింది.

Sai Krishna Missing Case Updates AP government constitutes SIT to probe the case

Sai krishna Case : ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఘటనలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు మిస్టరీని త్వరితగతిన ఛేదించేందుకుగానూ విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ఐజీ రవి ప్రకాశ్‌ను నియమించిన ప్రభుత్వం.. ఆయనతోపాటు ముగ్గురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ సభ్యలుగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం షమీతోపాటు అల్లూరి సీతారామరాజు ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ ఎస్పీ సుధాకర్ లు ఉన్నారు. ఈ ముగ్గురు అధికారులు సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాశ్ నేతృత్వంలో క్షేత్ర స్థాయిలో దర్యాప్తును వేగవంతం చేయనున్నారు. పాత రికార్డులు, సాంకేతిక ఆధారాలు ఇలా అన్నికోణాల్లో విశ్లేషించి సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారాన్ని సిట్ బృందం తేల్చనుంది.

Also Read : Pawan Kalyan : క్రిమినల్స్‌కు కులం ఉండదు.. తప్పు చేస్తే ఎవరినైనా వదిలేది లేదు : పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్

విజయవాడలో గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో పోలీసుల దర్యాప్తు ఇప్పటికే ముమ్మరంగా కొనసాగుతోంది. సాయికృష్ణ డెడ్ బాడీని స్వర్గపురి శ్మశాన వాటికలో దహనం చేశారని ఆరోపణలు వస్తుండటంతో అక్కడ ఆధారాలను పోలీసులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మే 24, 25 తేదీల్లో స్వర్గపురి శ్మశానంలో జరిగిన గుర్తుతెలియని మృతదేహాల దహనంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మే 23వ తేదీ రాత్రి 8గంటలకు రెండు గుర్తు తెలియని మృత దేహాలను స్వర్గపురికి తీసుకొచ్చినట్లు.. అప్పటికే సాయంత్రం 6గంటలు దాటిపోవటంతో ఆ మృతదేహాలను స్వర్గపురి మార్చురీలో ఉంచి.. మరుసటి రోజు ఖననం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఆ రెండు మృతదేహాల్లోలు 40ఏళ్లు పైబడిన వారివిగా రికార్డుల్లో నమోదైంది. దీంతో స్వర్గపురిలో ఎలక్ట్రిక్ దహనాలు చేసే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, వారి కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వారి ఇంటికెళ్లి పరామర్శించారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మరుసటిరోజు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మీ, అతని మేనమామ ఇతర కుటుంబ సభ్యులు అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. చంద్రబాబు వారి నుంచి వివరాలు సేకరించి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజును ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐ నాగరాజుపై హత్యానేరం కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్‌లోనే ఆయనపై కేసు నమోదు కావడం గమనార్హం. సాయికృష్ణను లాకప్‌లో కొట్టి చంపేశారని తల్లి విజయలక్ష్మి బలంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో క్లూస్‌ టీం రంగంలోకి దిగింది. స్టేషన్‌లో ఉన్న రెండు లాక్‌పలను పరిశీలించింది. సీఐ నాగరాజును పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాయికృష్ణ మిస్సింగ్ కేసు విచారణకు సిట్‌ను నియమించింది.