Sajjala Ramakrishna Reddy: వైఎస్ఆర్సీపీ నామినేషన్లపై కుట్ర? తడిగుడ్డతో గొంతులు కోస్తున్నారు.. టీడీపీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందని, అక్రమ కేసులు బనాయిస్తూ వైఎస్ జగన్ పర్యటనలపై ఆంక్షలు విధిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)విమర్శించారు.

Sajjala ramakrishna reddy press meet allegations on chandrababu, tdp

Sajjala Ramakrishna Reddy: అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ నేతలు అరాచకాలు, దాష్టీకాలు, దమనకాండకు ఒడిగడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల స్క్రూటినీ దశలోనే తమ పార్టీ నేతలపై బైండోవర్ కేసుల నుంచి హత్యాయత్నం కేసుల వరకు బనాయించి తీవ్రంగా వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

AP Local Body Elections: ఏపీలో ముగిసిన MPTC, ZPTC నామినేషన్ల పరిశీలన.. మరికొద్ది గంటల్లో అర్హుల జాబితా.. నవంబర్ 3న పోలింగ్ వాయిదా?

నామినేషన్లలో అక్రమాలు.. సీసీ కెమెరాల ఫుటేజ్‌పై సజ్జల ప్రశ్నల వర్షం:

ఎన్నికల సంఘం పరిధిలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను బయటపెట్టడానికి ప్రభుత్వం భయపడుతోందని, అభ్యర్థుల నామినేషన్ల నమోదులో అక్రమాలు జరుగుతున్నాయని సజ్జల ఆరోపించారు. కేవలం తమ పార్టీ అభ్యర్థులకు నామినేషన్లు వేసే స్వేచ్ఛ మాత్రమే కోరామని, కానీ అధికార పార్టీ నామినేషన్లు మాత్రమే కనిపించడం వెనుక కుట్ర ఉందని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ పక్కా ఆధారాలతో మాట్లాడుతుంటే, చంద్రబాబు మాత్రం ఎలాంటి విషయం లేకపోయినా గంటల తరబడి మాట్లాడుతూ తడిగుడ్డతో గొంతులు కోసే రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ జగన్ పర్యటనలపై ఆంక్షలు తగవు.. ప్రభుత్వ వైఖరిపై విమర్శల దాడి:

పాలనలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు వారంలో మూడు రోజులు హైదరాబాద్‌లో గడుపుతూ, సమాచారం ఇవ్వకుండా విదేశాలకు ఊరేగుతున్నారని, కానీ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ బెంగళూరు పర్యటనపై నిబంధనలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఇంకా అధికారంలోనే ఉన్నట్లు భావించి చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. దాడులన్నీ ప్రతిపక్షమే చేస్తోందంటూ సీఎం కళ్లార్పకుండా అబద్ధాలు చెప్తూ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని, శాంతిభద్రతలను గాలికి వదిలేశారని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.