అమరావతి పేరుతో అడ్డగోలు అవినీతి.. సీఎం చంద్రబాబుపై సజ్జల ఫైర్

లెక్కాపత్రం లేకుండా అప్పులు చేసేసి దోచేస్తున్నారు. నిర్మాణాల్లో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకం అంటున్నారు. అమరావతిలో మాకు సీట్లు, ఓట్లు రాలేదా..?

  • Published On : March 26, 2026 / 04:50 PM IST

 

Sajjala Ramakrishna Reddy: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. అమరావతి నిర్మాణం పేరుతో చంద్రబాబు ఓ పెద్ద అవినీతి యజ్ఞం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. అందరికంటే ముందుగా తాడేపల్లిలో జగన్ నివాసం కట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం పదేళ్ల తర్వాత కడుతున్నారని చెప్పారు. శాశ్వత రాజధాని తీర్మానం పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాకి తెర లేపారని అన్నారు. మళ్లీ ప్రజలను ముఖ్యంగా రైతులను భ్రమలో పడెయ్యడానికే ఈ కొత్త డ్రామా అని ధ్వజమెత్తారు. చంద్రబాబుకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే శాసనమండలి సమావేశం పెట్టాలని, చర్చ జరగాలని అన్నారు. అసెంబ్లీ ఒకటే పెట్టేసి ఏదో చేసేశాం అంటే సరిపోదన్నారు.

”పాత డిజైన్లు ఏమయ్యాయి..? మళ్లీ కొత్త డిజైన్లు అంటున్నారు. డిజైన్ల పేరుతోనే వేల కోట్లు వృధా చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని రేటు అమరావతిలో నిర్మాణానికి పెట్టి దోచేస్తున్నారు. Sft కి 11వేలు అంటే మాటలా..? ఈ అవినీతి ఎంతవరకు పోతుందో అర్థం కావడం లేదు. అసలు ఈ రెండేళ్లలో ఏ నిర్మాణాలు చేశారు.? పాత బిల్డింగ్ లకు మరమ్మత్తులు చేస్తున్నారు. రెండేళ్లలో ఒక్క కొత్త భవనం ప్రారంభించారా? అసలు కనెక్టివిటీ గురించి పట్టించుకున్నారా..? వెస్ట్ బైపాస్ క్రెడిట్ జగన్ ది. అది కూడా మీ అకౌంట్ లో వేసేస్తున్నారు.

లెక్కాపత్రం లేకుండా అప్పులు చేసేసి దోచేస్తున్నారు. నిర్మాణాల్లో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకం అంటున్నారు. అమరావతిలో మాకు సీట్లు, ఓట్లు రాలేదా..? మాకు అమరావతి ప్రాంతంపై ఎలాంటి వ్యతిరేకత ఆరోజూ లేదు.. ఈరోజూ లేదు.. మేము వ్యతిరేకిస్తున్నది అమరావతి పేరుతో జరిగే అవినీతి, దోపిడీనే. భూములిచ్చిన రైతులకు న్యాయం చెయ్యలేదు. మళ్లీ కొత్త భూములు తీసుకుంటున్నారు. ప్రజలను భ్రమలో పెట్టి కొత్త డ్రామాలు ఆడుతున్నారు.

అమరావతిలో ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చెయ్యండి. ఇంకో పదేళ్ళయినా తమకు న్యాయం జరిగేలా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ, సచివాలయాలు 250 మీటర్ల ఎత్తులో కడతాం అంటున్నారు. అక్కడ భూమి పరిస్థితిని బట్టి ఏ నిర్మాణం కట్టాలన్నా 200 మీటర్లు భూమిలోకి ఫౌండేషన్ తవ్వి కట్టాలి. ఇంత ఖర్చు అవసరమా..? అసలు వర్క్ ప్లేస్ లో అంత ఎత్తు భవనాలు అవసరమా..? శాసనమండలిలో మా పార్టీ బలంగా ఉందని చర్చ పెట్టడం లేదు. మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు” అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

Also Read: ఏపీలో స్టీల్‌ ప్లాంట్‌ క్రెడిట్‌ ఫైట్.. ఈ పోటీ ఎందుకోసం? ఎవరిది పైచేయి?