Amaravati Seed Access Road : అమరావతి నిర్మాణంలో మరో మైలురాయి.. సీడ్ యాక్సిస్ రోడ్ అంటే ఏంటి? దీని వల్ల లాభాలేంటి?
Amaravati Seed Access Road : ఏపీ రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సీడ్ యాక్సిస్ రోడ్డును సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
- Harish Thanniru
- Updated on- August 13, 2026 / 04:24 PM IST
Seed Access Road
Amaravati Seed Access Road : ఏపీ రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని అమరావతిని ప్రకాశం బ్యారేజీ – ఉండవల్లి కూడలి మధ్య పాత జాతీయ రహదారికి అనుసంధానంచేస్తూ నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును, బుకింగ్ హామ్ కెనాల్‌పై స్టీల్ బ్రిడ్జి, కొండవీటి వాగుపై స్టీల్ బ్రిడ్జిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గ్రిడ్ పద్ధతిలో నిర్మిస్తున్న అమరావతి రోడ్డు నెట్‌వర్క్ అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ ఒక కీలక ముందడుగుగా నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో సీడ్ యాక్సిస్ రోడ్ అంటే ఏమిటి..? దీని వల్ల లాభాలేమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఏపీ రాజధాని అమరావతిని 2028 నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాజధాని ప్రాంతంలో వేగంగా పనులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రత్యేకంగా రహదారిని నిర్మిస్తున్నారు. అదే సీడ్ యాక్సిస్ రోడ్. విజయవాడ – మంగళగిరి రహదారిని సీడ్ యాక్సెస్ రోడ్డుతో అనుసంధానం చేస్తున్నారు.
ఈ సీడ్ యాక్సిస్ రోడ్డును మూడు దశల్లో అభివృద్ధి చేస్తున్నారు. మొదటి దశలో 14.35 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తయ్యి రాకపోకలు సాగిస్తున్నాయి. రెండో దశలో 3.92 కిలో మీటర్ల పొడవు ఉన్న రోడ్డును నిర్మించారు. మూడో దశలో భాగంగా 3.50 కిలోమీటర్ల పొడవు ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డును ఉండవల్లి నుంచి మణిపాల్ ఆస్పత్రి వరకు నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు చకచకా కొనసాగుతున్నాయి.
సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రాజెక్టుకోసం మొత్తం 320.54 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ఈ రహదారికి సంబంధించి ఇప్పటికే 278.93 ఎకరాలను సేకరించిన ప్రభుత్వం.. రహదారి పనులనుసైతం పూర్తి చేసింది. మిగిలిన భూసేకరణ ప్రక్రియ తుది దశలో ఉంది. సీడ్ యాక్సిస్ రోడ్డు దొండపాడు వద్ద ప్రారంభమవుతుంది. రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి ప్రాంతాల మీదుగా సాగి చివరకు మణిపాల్ ఆస్పత్రుల సమీపంలో ఎన్‌హెచ్ – 16 (జాతీయ రహదారి)ను కలుపుతుంది. 21.77 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ రోడ్డు నిర్మాణానికి రూ. 1,519 కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు. మూడు దశల్లో నిర్మిస్తున్న ఈ 60 మీటర్ల వేడల్పు గల కారిడార్లో తొమ్మిది లేన్ల రోడ్లు, ప్రత్యేక బీఆర్టీఎస్ కారిడార్ సర్వీస్ రోడ్లు ఉంటాయి. రోడ్డు నిర్మాణంతోపాటే డ్రెయినేజీ, తాగునీటి సరఫరా, గ్యాస్, విద్యుత్ వ్యవస్థలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన పనులు కూడా ఏకకాలంలో పూర్తవుతున్నాయి.
ఇదిలాఉంటే.. ఈ సీడ్ యాక్సిస్ రహదారిలో ఉండవల్లి వద్ద భారీ స్టీల్ బ్రిడ్జ్‌లు నిర్మించారు. విజయవాడ- మంగళగిరి హైవేతో కనెక్ట్ చేయడంలో బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జి కీలక పాత్ర పోషిస్తుంది. సుమారు 82 కోట్లతో 478 మీటర్ల పొడవున నాలుగు వరుసలతో వంతెన నిర్మించారు. ఈ వంతెన ద్వారా వాహనదారులు విజయవాడ నుంచి నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డులోకి ప్రవేశించి రాజధాని అమరావతికి చేరుకోవచ్చు. మరోవైపు.. రాజధానికి వరద ముప్పు లేకుండా చేసే కొండవీటి వాగుపై 284మీటర్‌ల పొడవుతో అధునాతన స్టీల్ బ్రిడ్జిని అధికారయంత్రాంగం నిర్మాణం చేసింది.
ఈ సీడ్ యాక్సిస్ రోడ్డును ఒక రహదారిగానే కాకుండా ఒక పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణానది, కొండవీటి వాగు అందాలను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేక వ్యూ పాయింట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మరోవైపు పర్యావరణహితంగా ఉండేందుకు స్లైక్లింగ్ ట్రాక్‌లు, వాకింగ్ ట్రాక్‌లు, సుందరమైన ల్యాండ్‌స్కేప్ గార్డెన్లను సైత ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.
