Yanamala Krishnudu: వైసీపీ పార్టీకి యనమల కృష్ణుడు రాజీనామా.. తుని రాజకీయంలో సంచలనం
తుని ప్రాంతంలో బలమైన ప్రజాదరణ కలిగిన యనమల కృష్ణుడు(Yanamala Krishnudu) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
- V Santhosh Kumar
- Updated on- September 25, 2026 / 05:04 PM IST
Senior leader Yanamala Krishnudu has resigned from the YSRCP.
Yanamala Krishnudu: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తీవ్ర రాజకీయ కలకలం రేగింది. సీనియర్ నాయకుడు, తుని ప్రాంతంలో బలమైన ప్రజాదరణ కలిగిన యనమల కృష్ణుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో తుని నియోజకవర్గంలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో స్థానిక నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
టీడీపీ నుంచి వైసీపీకి – తాజా నిర్ణయంతో మరోసారి చర్చ:
తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో 40 ఏళ్లకు పైగా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిన యనమల కృష్ణుడు(Yanamala Krishnudu), గతంలో సుదీర్ఘకాలం పాటు తుని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ లభిస్తుందని ఆశించినప్పటికీ, అధిష్టానం యనమల దివ్యకు అవకాశం ఇవ్వడంతో ఆయన అసంతృప్తితో ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీలో సైతం కొనసాగలేక రాజీనామా చేయడం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.
కృష్ణుడు తదుపరి అడుగుపై ఉత్కంఠ – అనుచరులతో భేటీ:
వైసీపీని వీడిన అనంతరం యనమల కృష్ణుడు తన తదుపరి రాజకీయ భవిష్యత్తుపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. తన ముఖ్య అనుచరులు, మద్దతుదారులతో త్వరలోనే సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆయన మళ్లీ సొంత గూటికి చేరతారా లేదా స్వతంత్రంగా వ్యవహరిస్తారా అన్నదానిపై తుని నియోజకవర్గంలో సస్పెన్స్ నెలకుంది.
