Urea Cards: యూరియా కోసం రైతులకు ప్రత్యేక కార్డులు- మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

నానో యూరియను రెండు, మూడు ద‌శల్లో వాడాలని సూచించారు. ఎరువులు పక్కదారి పడితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చ‌రించారు.

  • Updated on- May 18, 2026 / 06:13 PM IST

Urea Cards: యూరియాకు సంబంధించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. యూరియా కోసం రైతులకు ప్రత్యేక కార్డులు ఇస్తామని ఆయన తెలిపారు. ఖరీఫ్ సాగుపై సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా యూరియా సప్లయ్ పై కీలక ప్రకటన చేశారు.

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా యూరియా దిగుమ‌తులకు ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశం ఉందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ క్రమంలో ఈసారి యూరియా కోసం రైతుల‌కు ప్రత్యేక కార్డులు ఇస్తామని చెప్పారు. ఆ కార్డుల ద్వారా రైతులు అవ‌స‌రం మేర‌కు యూరియా తీసుకోవ‌చ్చని స్పష్టం చేశారు. అయితే ముంద‌స్తు నిల్వలు చేసుకోవద్దని సూచించారు. ఇక నానో యూరియను రెండు, మూడు ద‌శల్లో వాడాలని సూచించారు. ఎరువులు పక్కదారి పడితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చ‌రించారు మంత్రి అచ్చెన్నాయుడు.

మరోవైపు వ్యవసాయ, ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులతో ఉమ్మడి సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి అచ్చెన్నాయుడు. రాబోయే ఖరీఫ్ సీజన్‌ను అత్యంత సమర్థవంతంగా నిర్వహించడం, విత్తనాలు, ఎరువుల లభ్యత, కాలువల మరమ్మతులపై సుదీర్ఘంగా చర్చించి సాగునీటి విడుదల షెడ్యూల్‌ను ఖరారు చేశామని తెలిపారు.

కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం 397 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఈ పనులన్నీ మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ 1వ తేదీ నుంచే కాలువలకు నీటిని విడుదల చేస్తున్నామని, రైతులు సాగుకు సిద్ధం కావాలని కోరారు.

Also Read: ఏపీ ప్రభుత్వం శుభవార్త.. జూన్ 12 నుంచి ఆ 1.53 లక్షల మందికి కొత్త పింఛన్లు