AP Local Body Elections : ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? సీఈసీ నిబంధనలు ఇవే.. ఎంత ఖర్చు చేయొచ్చు అంటే..
AP Local Body Elections : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) వెల్లడించింది. ఎన్నికల వ్యయ పరిమితులు, ప్రవర్తనా నియమావళి వివరాలను వెల్లడించింది.
- Harish Thanniru
- Published on- October 16, 2026 / 02:37 PM IST
AP Local Body Elections
AP Local Body Elections : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. తొలుత ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తోంది. ఆ తరువాత జడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలను నిర్వహించనుంది. ఇప్పటికే కార్పొరేషన్, మున్సిపల్, నగర పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియసైతం ప్రారంభమైంది. ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. 18వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లకు అవకాశం ఉంది.
Also Read : AP Government : ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు భారీ ఊరట లభించినట్లే..!
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) వెల్లడించింది. ఎన్నికల వ్యయ పరిమితులు, ప్రవర్తనా నియమావళి వివరాలను వెల్లడించింది.
అభ్యర్థుల ఎన్నికల ఖర్చు (వ్యయ) పరిమితులు ఇలా..
♦ గ్రామ పంచాయతీలు..
సర్పంచ్ : 10వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో గరిష్టంగా రూ. 4,00,000 ఖర్చు చేయొచ్చు. 10వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో గరిష్టంగా రూ.2,50,000 కంటే తక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
వార్డు సభ్యుడు : 10 వేల కంటే ఎక్కువ జనాభా ఉంటే రూ.1,00,000 అదేవిధంగా 10 వేల లోపు జనాభా ఉంటే రూ.60,000 వరకు ఖర్చు చేసేందుకు అనుమతి ఉంటుంది.
♦ మండల, జిల్లా పరిషత్ (MPTC & ZPTC)..
జెడ్పీటీసీ (ZPTC) అభ్యర్థి : గరిష్టంగా రూ. 8,00,000, ఎంపీటీసీ (MPTC) అభ్యర్థి గరిష్టంగా రూ. 4,00,000 ఖర్చు చేసేందుకు అనుమతి ఉంటుంది.
♦ మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు..
మున్సిపాలిటీలు : ఛైర్పర్సన్కు రూ. 20,00,000, వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి రూ. 7,50,000 (సాధారణ కార్పొరేషన్ స్థాయిని బట్టి వార్డు సభ్యుడికి రూ. 1.5 లక్షల నుండి పరిమితులు వర్తిస్తాయి).
నగర పంచాయతీలు : ఛైర్పర్సన్కు రూ. 10,00,000, కౌన్సిలర్ అభ్యర్థికి రూ.1,00,000 నుండి రూ. 5,00,000 వరకు ఖర్చు చేసేందుకు అనుమతి ఉంటుంది.
♦ నగర పాలక సంస్థలు (మున్సిపల్ కార్పొరేషన్లు)..
విశాఖపట్నం (GVMC) : మేయర్ అభ్యర్థికి రూ. 40,00,000, కార్పొరేటర్ అభ్యర్థికి రూ. 20,00,000. ఇతర కార్పొరేషన్లలో మేయర్ అభ్యర్థికి రూ.25,00,000, కార్పొరేటర్ అభ్యర్థికి రూ.2,00,000 నుంచి రూ. 10,00,000 ఖర్చు చేసేందుకు అనుమతి ఉంటుంది.
♦ ముఖ్యమైన ఎన్నికల కోడ్ (MCC) నిబంధనలు..
ఖర్చుల లెక్కల నిర్వహణ : ప్రతి అభ్యర్థి రోజువారీ ఖర్చుల వివరాలను నిర్దేశిత రిజిస్టర్లో నమోదు చేయాలి. ఫలితాలు వెల్లడైన 45 రోజులలోపు పూర్తి ఎన్నికల వ్యయ లెక్కలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది.
ఓటర్ల ప్రలోభాలపై నిషేధం : ఓటర్లకు నగదు, మద్యం, బహుమతులు, నిత్యావసరాలు పంచడం చట్టరీత్యా నేరం. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్లు, నిఘా బృందాలు వీటిపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తాయి.
కొత్త పథకాలు, శంకుస్థాపనలు నిషేధం: ఎన్నికల షెడ్యూల్ వెలువడిన ప్రాంతాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి కొత్త సంక్షేమ పథకాలు, గ్రాంట్లు, శంకుస్థాపనలు లేదా అభివృద్ధి పనుల ప్రకటనలు చేయకూడదు.
ప్రభుత్వ యంత్రంగ దుర్వినియోగం: అధికారిక వాహనాలు, ప్రభుత్వ భవనాలు, గెస్ట్ హౌస్లు లేదా ప్రభుత్వ సిబ్బందిని పార్టీ ప్రచారాలకు ఉపయోగించడం పూర్తిగా నిషేధం.
ప్రచార సమయం, అనుమతులు..
♦ లౌడ్ స్పీకర్లు, ర్యాలీలు, సభలకు సంబంధిత పోలీస్, మున్సిపల్ అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి.
♦ రాత్రి 10:00 గంటల నుంచి ఉదయం 6:00 గంటల వరకు మైకులు, లౌడ్స్పీకర్లతో ప్రచారం నిషేధం.
♦ ప్రైవేట్ ఇళ్లపై, ప్రహరీలపై అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, పోస్టర్లు వేయరాదు.
♦ దేవాలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచార వేదికలుగా వాడకూడదు. కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయరాదు.
