AndhraPradesh : పుంగనూరులో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.. మిథున్ రెడ్డి కాన్వాయ్పై రాళ్ల దాడి.. గాల్లోకి కాల్పులు
Andhra Pradesh : అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఒకరిపైఒకరు రాళ్లదాడికి పాల్పడ్డారు.
Andhra Pradesh municipal elections 2026
AndhraPradesh : ఏపీలో స్థానిక ఎన్నికల కోలాహలం మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభంకాగా.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి చేసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి తలెత్తడంతో పోలీసులు గాల్లోకి ఒకరౌండ్ కాల్పులు జరిపారు.
నామినేషన్ల దాఖలుకు వెళ్తున్న క్రమంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిపైఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ పై రాళ్లదాడి జరిగింది. దీంతోతీవ్ర ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకోవటంతో పోలీసులు ఇరువర్గీయులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి సర్ధుమణగకపోవడంతో డీఎస్పీ గాల్లోకి ఒకరౌండ్ కాల్పులు జరిపారు. రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. పోలీసులు పటిష్ఠ బందోబస్తే ఏర్పాటు చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలో టీడీపీ నేత మధు రాయల్కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆరు వాహనాలు ధ్వంసం అయ్యాయి.
ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నేటి నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కోసం మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని 100 పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో శుక్రవారం ఉదయం 11గంటల నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభమైంది. ఈ క్రమంలో నామినేషన్ల దాఖలు కేంద్రాల వద్ద వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.
పుంగనూరులో నామినేషన్లకు వెళ్తతున్న క్రమంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. పలువురికి గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆ ప్రాంతంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాయచోటిలోనూ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వాహనాలకు నిప్పుంటించారు. నామినేషన్ల తొలిరోజే పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
