Sunil Kumar Naik
Sunil Kumar Naik : నర్సాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజును గత ప్రభుత్వం హయాంలో సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన (ఏ-6) నాటి సీఐడీ డీఐజీ, ప్రస్తుతం బీహార్ అగ్నిమాపక, హోంగార్డుల విభాగం ఐజీగా ఉన్న సునీల్ కుమార్ నాయక్‌ను ఏపీ పోలీసులు సోమవారం అరెస్టు చేయగా.. కొద్ది గంటల్లోనే ఆయన్ను వదిలేయాల్సి వచ్చింది. ఈ పరిణామం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. అయితే, తాజాగా.. దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలోని బృందం కీలక నిర్ణయం తీసుకుంది. సునీల్ నాయక్‌ను మళ్లీ అరెస్టు చేసి, ఏపీకి తరలించే వరకూ పట్నాలోనే ఉండాలని నిర్ణయించింది.
గత ప్రభుత్వం హయాంలో ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి కె. రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ నమోదైన కేసులో నిందితుడైన సునీల్ నాయక్‌ను సోమవారం విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలోని బృందం పట్నా వెళ్లి అరెస్టు చేసింది. అరెస్టు తరువాత స్థానిక పోలీసుల సాయంతో సునీల్ నాయక్‌కు అక్కడి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
కోర్టులో ట్రాన్సిట్ వారెంటు తీసుకుని సాయంత్రానికి విమానంలో ఏపీకి తీసుకొచ్చేందుకు టికెట్లు కూడా కొనుగోలు చేశారు. కానీ, పట్నా 9వ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ట్రాన్సిట్ వారెంట్ జారీకి నిరాకరించింది. పలు కారణాలతో ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వడానికి మెజిస్ట్రేట్ నిరాకరించారు. దీంతో బిహార్ పోలీసు అధికారులు ఏపీ పోలీసుల అదుపులో నుంచి సునీల్ నాయక్‌ను విడిపించుకుని తీసుకెళ్లిపోయారు.
బీహార్‌లో జరిగిన పరిణామాలు దర్యాప్తు అధికారి దామోదర్ ఏపీ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొచ్చారు. వెంటనే మరికొందరు పోలీసు సిబ్బంది, న్యాయ నిపుణులతో కూడిన బృందాన్ని పట్నాకు పంపించారు. ఈసారి బిహార్ పోలీసులు, సునీలానాయక్ తరపు వారు ఎన్ని చిక్కులు, అడ్డంకులు కల్పించినాసరే వాటన్నింటినీ చట్టప్రకారమే అధిగమించేందుకు ఏపీ పోలీసు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇప్పటికే బిహార్ పోలీసు ఉన్నతాధికారులతోనూ ఏపీ పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడినట్లు సమాచారం.
సునీల్ నాయక్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ పోలీసులు దాఖలుచేసిన పిటిషన్‌పై గుంటూరు ప్రత్యేక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వాదనలు జరిగాయి. అధికారిక ఉత్తర్వులు వెలువడగానే ఆయన్ను మరోమారు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం సునీల్ నాయక్ ఎవరికీ అందుబాటులో లేరని, ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని దర్యాప్తు బృందం గుర్తించింది.