మూడు రాజధానుల బిల్లు అమోదం వెనుక స్టోరీ ఏంటి?

ఆంధ్రప్రదేశ్‌లో గ‌వ‌ర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వ‌ద్దకు చేరిన మూడు రాజ‌ధానుల బిల్లుపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం త‌న వ‌ద్దకు పంపించిన బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాల‌న్న దానిపై గ‌వ‌ర్నర్ కేంద్రంలో పెద్దల‌తో మాట్లాడిన‌ట్లు సమాచారం. దీంతో పాటు బిల్లును పూర్తిగా ప‌రిశీలించి న్యాయ‌ప‌ర‌మైన స‌ల‌హాలు తీసుకున్నారని చెబుతున్నారు. అన్నివిధాలుగా ఆలోచించిన తర్వాత గ‌వ‌ర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.



ఇంతకుముందు ఏపీ ప్రభుత్వం తాము పంపించిన బిల్లు గురించి వివ‌రించ‌డానికి ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని గ‌వ‌ర్నర్ వ‌ద్దకు పంపించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ బిల్లుల విషయంలో సానుకూలంగా స్పందించారని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

మ‌రో రెండు మూడు రోజుల్లో ఈ బిల్లులపై తన నిర్ణయాన్ని గ‌వ‌ర్నర్ ప్రక‌టిస్తార‌నే ఆశాభావాన్ని ప్రభుత్వం వ‌ర్గాలు వ్యక్తం చేశాయి. అంతేకాని, ఇంత త్వరగా నిర్ణయం తీసుకొంటారనుకోలేదు. కేంద్రంకూడా ఈ అంశంలో జోక్యం చేసుకోబోమ‌ని ప‌దే ప‌దే చెప్పింది. దీంతోపాటు శాస‌నస‌భ‌లో ఈ బిల్లుకు ఆమోదం పొందిన త‌ర్వాత బిల్లును ఆపే అవ‌కాశాలు చాలా త‌క్కువ ఉన్నాయి. సెలక్ట్ క‌మిటీకి పంపిస్తామ‌ని మండ‌లి చైర్మన్‌ తెలిపిన త‌ర్వాత బిల్లు ఇంకా మండ‌లి ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో బిల్లును మండ‌లి తిర‌స్కరించినట్టు ఎలా అవుతుంద‌ని కొన్ని సాంకేతికప‌ర‌మైన వాద‌న‌లను ప్రతిపక్ష టీడీపీ తెర‌పైకి తీసుకొచ్చింది.దీంతోపాటు విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం న‌డుచుకోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఈ విధంగా మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయ‌డం సాధ్యం కాద‌న్నది మ‌రో వాదన. గవర్నర్ మాత్రం ఈ వాదనను పట్టించుకోలేదు.



టీడీపీ వాదన‌ల‌కు అధికార‌ పార్టీ నేత‌లు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు. త‌మ ప్రభుత్వం ఎక్కడా మూడు రాజ‌ధానులు అని బిల్లులో చెప్పలేదని అంటోంది. అధికార వికేంద్రీక‌ర‌ణ అని మాత్రమే చెబుతోందని వాదించింది. అలాంట‌ప్పుడు ప్రతిప‌క్షపార్టీ చేస్తోన్న, చూపిస్తోన్న సాంకేత‌క అంశాలు త‌మ‌కు వ‌ర్తించ‌వని ప్రభుత్వ పెద్దలు అన్నారు. దీంతో పాటు ఇప్పటికే బీజేపీ కీల‌క నేత‌లు రామ్ మాధవ్ వంటి వాళ్లు కూడా రాజ‌ధాని అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండ‌ద‌ని ప‌లు సంద‌ర్భాల్లో తెలిపారు. శాస‌నస‌భ‌లో ప్రవేశ‌పెట్టిన బిల్లుల‌ను కేంద్రం ఆపేయ‌డం వంటి పరిణామాలు జరగవనే అంటున్నారు. అందుకే మూడు రాజ‌ధానుల బిల్లుపై ఇప్పుడు గ‌వ‌ర్నర్ ఈ బిల్లు స్టాంప్ వేశారు.