AP Rain Alert
AP Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం సాయంత్రం వాయుగుండంగా బలహీన పడింది. శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టిపుకు సమీపంలో శనివారం సాయంత్రం తీవ్ర వాయుగుండం (Vayugundam) తీరం దాటినట్లు భారత వాతావరణ విభాగం (IMD) పేర్కొంది. అయితే, ఆదివారం ఉదయం వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది.
వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం ఉదయంకు తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. శనివారం సాయంత్రం తీరందాటే సమయంలో ఈ వాయుగుండం ముల్లయిట్టివుకు 30 కిలోమీటర్లు, జాఫ్నా (శ్రీలంక)కు 70 కిలోమీటర్లు, మన్నార్ (శ్రీలంక)కు 90, కరైకల్ (పుదుచ్చేరి)కు 190, చెన్నైకు 400 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఆదివారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలహీన పడింది.
అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. చాలాచోట్ల ఆకాశం మేఘావృతమవడంతోపాటు తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ఏపీలో రైతులు సాగుచేసిన పంటలు చేతికొచ్చే దశలో ఉన్నాయి. మిర్చి, మొక్కజొన్న, వరి వంటి పంటలు కోతదశలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో మిర్చి పంట కల్లాల్లో ఉండగా.. మరోవైపు వరి సాగుచేసిన రైతులు వర్ష సూచనలతో ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పంటలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది. రాయలసీమ జిల్లాలతోపాటు ప్రకాశం, బాపట్ల, పల్నాడులోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.