Minister Lokesh: రూ.100 కోట్ల పరకామణి దొంగ వెనుక వైసీపీ నేతలు.. తిరుమల శ్రీవారి సొత్తును దోచుకున్నారు..మంత్రి లోకేశ్ సంచలన ఆరోపణలు

దొంగలు, దోపిడీదారులకు కేరాఫ్ అడ్రస్ గా వైసీపీ నేతలు తయారయ్యారని లోకేశ్ ధ్వజమెత్తారు.

Minister Lokesh: తిరుమల పరకామణి చోరీ ఘటనపై తీవ్రంగా స్పందించారు మంత్రి లోకేశ్. ట్విట్టర్ వేదికగా వైసీపీపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. 100 కోట్ల రూపాయల దోపిడీ వెనుక వైసీపీ నేతలు ఉన్నారని లోకేశ్ ఆరోపించారు. శ్రీవారి సొత్తును రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెట్టారని చెప్పారు. పరకామణి చోరీలో టీటీడీ మాజీ ఛైర్మన్ నుంచి మాజీ సీఎం జగన్ వరకు అందరూ నిందితులే అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. దొంగలు, దోపిడీదారులకు కేరాఫ్ అడ్రస్ గా వైసీపీ నేతలు నిలిచిపోయారని లోకేశ్ ధ్వజమెత్తారు.

”జగన్ ఐదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలింది. దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేరాఫ్ అడ్రస్ గా జగన్ మార్చారు. చివరకు తిరుమల శ్రీవారి సొత్తును కూడా వదల్లేదు. జగన్, భూమన కరుణాకర్ రెడ్డి ఏకంగా పరకామణినే దోచేశారు. కొల్లగొట్టిన డబ్బును రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు. అధికారం అండతో జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదు. లడ్డూని కల్తీ చేసి అన్న ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు. పరకామణి వీడియోలు బయటపడ్డాయి. రేపు నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారు” అని మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

Also Read: గుడ్‌న్యూస్.. జీఎస్టీ సంస్కరణల ఎఫెక్ట్.. పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గాయ్..