Tirumala (3) 11zon
Tirumala Sreevari Darshan: తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం, సర్వ దర్శనం టోకెన్ల సంఖ్యను తిరుమల తిరుపతి దేవస్థానం పెంచనుంది. ప్రస్తుత ఫిబ్రవరికి సంబంధించిన అదనపు కోటాను.. మరి కాసేపట్లో టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. రేపటి నుంచి ఫిబ్రవరి 28 వరకు.. రోజుకు అదనంగా.. 300 రూపాయల 13 వేల ప్రత్యేక దర్శన టికెట్లను రిలీజ్ చేయనునున్నారు.
అలాగే.. ఈ నెల 26 నుంచి 28 వరకూ రోజుకు అదనంగా 5 వేల సర్వ దర్శనం టోకెన్లు కేటాయించనున్నారు. ఆఫ్ లైన్ విధానంలో.. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లోని కౌంటర్లలో భక్తులకు వీటిని కేటాయించనున్నారు.
ఇక.. మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను.. ఆన్ లైన్ లో రేపు విడుదల చేయనున్నారు. రోజుకు 25 వేల టికెట్లను విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు.. రోజుకు 20 వేల సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని ఆఫ్ లైన్ కేంద్రాల ద్వారా జారీ చేయనున్నారు.
కరోనా కారణంగా.. ఇన్నాళ్లూ పరిమిత సంఖ్యలో భక్తులను శ్రీవారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతిస్తోంది. థర్డ్ వేవ్ ప్రభావం తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్న తరుణంలో.. మళ్లీ భక్తుల సంఖ్యను పెంచేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కొన్నాళ్ల క్రితం ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి దర్శన టోకెన్లను తిరుపతిలో జారీ చేయడం ప్రారంభించింది.
తాజాగా.. ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా పెంచుతూ నిర్ణయించిన టీటీడీ.. ఆ మేరకు ఆన్ లైన్ లో టికెట్లను జారీ చేస్తోంది. ఈ చర్యపై.. శ్రీవారి భక్తులు ఆనందంగా ఉన్నారు. మళ్లీ తిరుమలలో భక్తుల రద్దీ, అద్దె గదులకు డిమాండ్ కూడా మునుపటిలాగే పెరగవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో.. కరోనా నిబంధనలు పాటిస్తూ.. శ్రీవారి దర్శనం పూర్తి చేసుకోవాలని.. భక్తులకు టీటీడీ సూచిస్తోంది.