TTD Board: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. ఇక కొండపై ఆ వంటకం దొరకదు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Board) కొండపైకి వచ్చే కోట్లాది మంది భక్తుల ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.

TTD bans gobi dishes in tirumala hotels due to cauliflower worm complaints

  • తిరుమలలో గోబీ వంటకాల నిలిపివేత
  • క్యాలీఫ్లవర్‌లో పురుగుల ఫిర్యాదుల ప్రభావం
  • భక్తుల ఆరోగ్యానికే టీటీడీ ప్రాధాన్యం

TTD Board: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొండపైకి వచ్చే కోట్లాది మంది భక్తుల ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా తిరుమలలోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా అమ్ముడయ్యే క్యాలీఫ్లవర్ (గోబీ) ఆధారిత వంటకాలను నిలిపివేయాలని ఆరోగ్య విభాగం ఆదేశించినట్లు తెలుస్తోంది. క్యాలీఫ్లవర్‌లో పురుగులు వస్తున్నాయంటూ భక్తుల నుంచి వరుసగా ఫిర్యాదులు రావడం, ఇటీవలే ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లోనూ ఇది నిజమని తేలడంతో టీటీడీ హెల్త్ వింగ్ ఈ కఠిన చర్యకు శ్రీకారం చుట్టింది.

One Rupee Function Hall: ఒక్క రూపాయికే ఏసీ ఫంక్షన్ హాల్.. పేదలకు కార్పొరేట్ కానుక.. ప్రారంభించిన మంత్రి నారాయణ

హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ‘గోబీ’పై కట్టడి:

తిరుమల (TTD Board)కొండపై ఉన్న సుమారు 162 ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, ఇతర కాంటీన్లలో గోబీ 65, గోబీ మంచూరియా, గోబీ రైస్ వంటి చైనీస్ వంటకాలకు భక్తులలో మంచి డిమాండ్ ఉండేది. అయితే, ఈ సీజన్‌లో క్యాలీఫ్లవర్‌లో పురుగులు ఉండే అవకాశం ఎక్కువగా ఉండటం వల్ల సరైన రీతిలో శుభ్రం చేయకపోతే భక్తుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో సోమనారాయణ హోటల్ నిర్వాహకులతో సమావేశమై, భక్తుల శ్రేయస్సు దృష్ట్యా ఈ వంటకాల విక్రయాలను నిలిపివేయాలని స్పష్టం చేశారు. నిర్వాహకులు సైతం ఈ సూచనలకు సహకరించేందుకు సిద్ధమయ్యారు.

అన్నప్రసాదంపై నిర్ణయం త్వరలోనే:

మరోవైపు తిరుమల తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన ట్రస్టులో క్యాలీఫ్లవర్ వినియోగంపై త్వరలోనే అధికారిక స్పష్టత రానుంది. ప్రతినిత్యం సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తుండగా, దాతల నుంచి వచ్చే 20 టన్నుల కూరగాయల్లో క్యాలీఫ్లవర్ కూడా ఉంటోంది. టీటీడీ పూర్తిస్థాయి నిషేధ నిర్ణయం తీసుకుంటే దాతల నుంచి క్యాలీఫ్లవర్ సేకరణను నిలిపివేయడంతో పాటు, తిరుపతి నుంచి కొండపైకి ఈ కూరగాయ రాకుండా విజిలెన్స్ విభాగం ద్వారా నిఘా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.