TTD Srivani Darshan Rules 2026 : భక్తులకు TTD కీలక అలర్ట్.. శ్రీవాణి దర్శనం టికెట్ల బుకింగ్స్‌లో మార్పులు.. మార్చి 27 నుంచే అమలు
TTD Srivani Darshan Rules 2026 : భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. శ్రీవాణి దర్శన టికెట్ల బుకింగ్ లో మార్పులు చేసింది.
- Dharani Pilli
- Published On : March 27, 2026 / 09:45 PM IST
ttd introduces new srivani vip break darshan tickets booking rules pay rs 10500 single payment system starts from march 27
TTD Srivani Darshan Rules 2026 : తిరుమల భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీ చేసింది. తాజాగా ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో టీటీడీ పలు కీలక మార్పులు చేసింది. శుక్రవారం, అంటే మార్చి 27 నుంచే ఈ కొత్త రూల్స్‌ను టీటీడీ అమల్లోకి తీసుకువచ్చింది. శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇచ్చిన తర్వాత వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు బుక్ చేసుకుందామని ప్రయత్నిస్తుండగానే.. ఆ టికెట్లు అయిపోయినట్లు చూపిస్తోంది. ఈ అంశంపై గత కొన్ని రోజులుగా భక్తులు టీటీడీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ ఈ సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చింది.
ఇప్పటి వరకు భక్తులు శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10 వేలు విరాళం ఇచ్చాక, రూ.500 అదనంగా చెల్లించి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉండేది. అయితే విరాళం ఇచ్చి దర్శనం టికెట్ కోసం రూ.500 చెల్లించేలోపే టికెట్లు అయిపోతున్నాయి. దీంతో విరాళం ఇచ్చిన భక్తులు వీఐపీ దర్శనం టికెట్లు బుక్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై స్పందించిన టీటీడీ టికెట్ బుకింగ్ విషయంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఇక నుంచి శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళం ఇచ్చి.. ఆ తర్వాత రూ.500 చెల్లించి వీఐపీ దర్శనం టికెట్ తీసుకోవాలని భావించేవారు.. ఇకపై మొత్తం అంటే విరాళం రూ.10 వేలు, టికెట్ కోసం రూ.500 కలిపి మొత్తం ఒకేసారి రూ.10,500 చెల్లించవచ్చు. ఈ కొత్త విధానం వల్ల ట్రస్టుకు విరాళం ఇచ్చిన భక్తులకు వీఐపీ దర్శనం టికెట్లు వెంటనే బుక్ అవుతాయి. టికెట్ కోసం మరోసారి ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ మార్పులను అమలు చేసే బాధ్యతను టీటీడీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. దీంతో ఇకపై భక్తులు డెబిట్, యూపీఐ, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్‌ల ద్వారా ఒకేసారి చెల్లింపులు చేయవచ్చు.
ఈ సంవత్సరం జనవరి నుంచి టీటీడీ.. శ్రీవాణి టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేస్తోంది. ప్రతిరోజూ 800 టికెట్లను మాత్రమే జారీ చేస్తోంది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు శ్రీవాణి టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. కేవలం 1+3 భక్తులకు మాత్రమే బుక్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఒక ఐడీపై ఒకసారి టికెట్ బుక్ చేసుకుంటే.. మళ్లీ వారం రోజుల వరకు ఆ ఐడీపై టికెట్ బుక్ చేసుకోలేరు.
