Tirumala : తిరుమల భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్.. లడ్డూల కోసం కొత్త బ్యాగులు వచ్చేశాయ్! ధరలు ఎంతంటే?
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదాల విషయంలో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక నిర్ణయం తీసుకుంది.
- Harish Thanniru
- Published on- September 29, 2026 / 07:55 AM IST
Tirumala Tirupati Devasthanam
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదాల విషయంలో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా లడ్డూల కోసం జనపనార (జూట్) బ్యాగులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణతోపాటు జనపనార రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి టీటీడీ ఈ బ్యాగులను ప్రోత్సహిస్తోంది.
Also Read : Dimple Hayathi : తిరుమలలో డింపుల్ హయతి కూచిపూడి నృత్యం.. ఫొటోలు వైరల్..
పరిమాణాన్ని బట్టి ఈ బ్యాగులు రూ.10, రూ.20, రూ.50, రూ.80, రూ.100 ధరలకు లభిస్తున్నాయి. శ్రీవారి ఆలయం వెనుక ఉన్న లడ్డూ విక్రయ కేంద్రంలోని జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కౌంటర్‌లో వీటిని విక్రయిస్తున్నారు. వీటితో పాటు బయోడీగ్రేడబుల్ సంచులు కూడా భక్తులకు అందుబాటులో ఉన్నాయి.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు తులసి విత్తనాలతో కూడిన ఎకో ఫ్రెండ్లీ కవర్లను తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కవర్‌ను మట్టిలో పెట్టి నీరు పోస్తే.. ఆ కవర్ కరిగిపోయి అందులోని తులసి గింజల ద్వారా మొక్కలు మొలుస్తాయి. ప్రస్తుతం ఈ ఎకో ఫ్రెండ్లీ కవర్లు తిరమల లడ్డూ ప్రసాదం కౌంటర్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా జనపనార బ్యాగులు అందుబాటులోకి వచ్చాయి.
మరోవైపు నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో వచ్చిన ఫీడ్‌బ్యాక్, చెక్‌లిస్ట్‌ల ఆధారంగా లోపాలను సరిదిద్దాలని అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సూచించారు. కేవలం 17 రోజుల వ్యవధిలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మోత్సవాలను మరింత విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
