Dussehra 2021: అంతిమ విజయం ధర్మానిదే.. విజయదశమి శుభాకాంక్షలు
విజయానికి ప్రతీక విజయదశమి. ధర్మ సంరక్షణ పోరాటంలో అంతిమ విజయం ధర్మానిదే అనే సత్యాన్ని తెలిపే పండగ విజయదశమి. చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని..
- Naresh Mannam
- Published On : October 15, 2021 / 06:34 AM IST
Ultimate Victory Is Righteous Vijayadashami Wishes
Dussehra 2021: విజయానికి ప్రతీక విజయదశమి. ధర్మ సంరక్షణ పోరాటంలో అంతిమ విజయం ధర్మానిదే అనే సత్యాన్ని తెలిపే పండగ విజయదశమి. చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను తొలగించుకునుటకు ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణు కోరేందుకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గమే ఈ శరన్నవరాత్రులు.
విజయదశమిని పది రోజులపాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. చరిత్ర ప్రకారం విజయదశమి రోజున రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు.
బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్దం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టగా.. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారి ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పదునేనమిది చేతులను కలిగి ఉంది. సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది.
మహిషాసురుని తరపున యుద్దానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవ రూపముతో భీకరముగా పోరు. చివరకు మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా పిలవబడింది. అదే విజయదశమి కూడా.
