Vallabhaneni Vamsi : సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ..
Vallabhaneni Vamsi : విమానాశ్రయ కాంట్రాక్టు వివాదంపై సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ రాశారు. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన ఆయన సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
- Sreehari A
- Updated on- July 14, 2026 / 06:30 PM IST
Vallabhaneni Vamsi
- విమానాశ్రయ కాంట్రాక్టు వివాదం.. సీఎం చంద్రబాబుకు వంశీ లేఖ
- విమానాశ్రయ పనుల్లో అవకతవకలున్నాయా? సీబీఐ దర్యాప్తునకు వంశీ డిమాండ్
- విమానాశ్రయ కాంట్రాక్టులో నిజాలు బయటపడాలి..
Vallabhaneni Vamsi : విజయవాడ విమానాశ్రయం పెండింగ్ పనుల కాంట్రాక్టు కేటాయింపులపై గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కోరుతూ రాష్ట్ర సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ముఖ్యంగా తనపై వస్తున్న ఆరోపణలపై కూడా సీబీఐ దర్యాప్తు చేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విమానాశ్రయం పెండింగ్ పనుల కాంట్రాక్టుకు సంబంధించి పనులను కేఎంవీ సంస్థకు కేటాయించడంపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణలను వంశీ తన లేఖలో ప్రస్తావించారు. గతంలో 80 శాతం పనులను రూ.300 కోట్లకు కేటాయించారని, మిగిలిన 20 శాతం పనులకు రూ.205 కోట్లు కేటాయించడం వెనుక భారీ అవినీతి జరిగిందని యార్లగడ్డ ఆరోపించినట్లు తెలిపారు.
నిజనిజాలు బయటపడాలి :
అలాగే, కేఎంవీ సంస్థ తనకు, సన్నిహిత వ్యక్తులకు చెందినదని, ఎన్నికల సమయంలో ఆ సంస్థ నుంచి ఆర్థిక సాయం అందిందని చేసిన ఆరోపణలను కూడా వంశీ లేఖలో ప్రస్తావించారు. ఈ ఆరోపణలపై నిజానిజాలు బయటపడాలంటే నిష్పక్షపాత విచారణ అవసరమని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నాని తెలిపారు.
కేఎంవీ సంస్థకు కాంట్రాక్టు కేటాయింపులో అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలితే ఆ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వంశీ కోరారు. అంతేకాదు.. తన ప్రమేయం ఉన్నట్లు రుజువైతే తనపైనా ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని లేఖలో క్లారిటీ ఇచ్చారు.
విమానాశ్రయ కాంట్రాక్టు అంశం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ స్వయంగా సీబీఐ విచారణ కోరడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది.
