Vande Bharat Sleeper: ‘వందే భారత్ స్లీపర్’ రైళ్లు సిద్ధం.. అత్యాధునిక సౌకర్యాలు, హైస్పీడ్.. విజయవాడ డివిజన్ నుంచే..
త్వరలోనే సరికొత్త అనుభూతిని అందించేందుకు వందే భారత్ స్లీపర్ రైళ్లు(Vande Bharat Sleeper) అందుబాటులోకి రానున్నాయి.
- V Santhosh Kumar
- Published on- July 22, 2026 / 11:02 AM IST
Vande bharat sleeper trains vijayawada dasara launch
- త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లు
- దసరా పండుగనాటికి అందుబాటులోకి సేవలు
- విమాన స్థాయి సౌకర్యాలతో డిజైన్
Vande Bharat Sleeper: భారతీయ రైల్వే రంగాన్ని ఆధునీకరించే దిశగా మరో అద్భుతమైన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇప్పటివరకు కేవలం కూర్చుని ప్రయాణించే (చైర్ కార్) వందే భారత్ రైళ్లను చూసిన ప్రయాణికులకు, త్వరలోనే సరికొత్త అనుభూతిని అందించేందుకు వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. విజయవాడ డివిజన్ మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక రైళ్లను పట్టాలెక్కించేందుకు అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
దసరా పండుగ నాటికి ప్రయాణికులకు ఈ సేవలు అందుబాటులోకి తెచ్చేలా రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విజయవాడ మీదుగా సికింద్రాబాద్, చెన్నై, విశాఖపట్నం వంటి నగరాలకు సాధారణ వందే భారత్ రైళ్లు(Vande Bharat Sleeper) విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాబోతున్న స్లీపర్ రైళ్లతో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి మరింత వేగవంతమైన, సుఖవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.
ఈ వందే భారత్ స్లీపర్ రైళ్లను విమాన ప్రయాణానికి ఏమాత్రం తీసిపోని విధంగా, అత్యంత విలాసవంతమైన ఇంటీరియర్స్‌తో డిజైన్ చేశారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీల్లో లేటెస్ట్ ఎల్ఈడీ లైటింగ్, సౌండ్ ప్రూఫింగ్, వైఫై, ఛార్జింగ్ పాయింట్లు, ఆటోమేటిక్ డోర్లతో పాటు పక్కా భద్రతా సెన్సార్లను అమర్చారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించిన ఈ రైలులో మొత్తం 16 బోగీలు ఉంటాయని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.
