రాజకీయ వారసత్వంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వంగవీటి రాధా. తండ్రి వంగవీటి రంగాకు తగ్గ తనయుడు అనిపించుకుంటారని అందరూ అంచనా వేశారు. ప్రస్తుతం జోరు తగ్గి.. రాజకీయాల్లో నిలకడ లోపిస్తోందనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకోవడంలో విఫలం అవుతున్నారనే విమర్శలు పెరిగిపోతున్నాయి.
వంగవీటి రాధా రాజకీయాల్లోకి రావడంతో ఓ సామాజిక వర్గానికి ప్రతినిధిగా నిలుస్తారని భావించారు. ఆ వర్గం ఓట్లను ఏ పార్టీలో ఉన్నా ప్రభావితం చేస్తారని అంచనాలు వేశారు. కానీ, అలా జరగలేదు. పార్టీలో నిలకడ లోపం కనిపిస్తుంది. విజయవాడకు చెందిన కీలక నేత వంగవీటి రాధా పార్టీ మారతారనే ప్రచారం ఇప్పుడు మళ్లీ మొదలైంది. ఇప్పటికే పలు పార్టీలు మారిన ఆయన.. ఈ సారి బీజేపీలో చేరబోతున్నారని చెబుతున్నారు.
కొంత కాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న ఆయన.. మధ్యలో జనసేనలో చేరతారని భావించారు. తాజాగా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయమై ఇటీవల హైదరాబాద్‌లో కేంద్ర మంత్రితో సంప్రదింపులు జరిపారట. వైసీపీలో కీలకంగా పనిచేసిన వంగవీటి రాధా.. సీటు ఇవ్వలేదనే కారణంతో గతేడాది ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఆ సమయంలో జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు.
టీడీపీలో రాధాకు సీటు దక్కలేదు. అయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గానే పాల్గొన్నారు. అంతేకాదు చంద్రబాబు సీఎం కావాలంటూ యాగాలు కూడా చేశారు. వైసీపీ విజయం సాధించి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాస్త యాక్టివ్‌గానే ఉన్న వంగవీటి రాధా.. ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయారు. ఆ మధ్యలో రెండుసార్లు పవన్ కల్యాణ్‌ని కలవగా.. జనసేనలో చేరబోతున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ వంగవీటి అలా చేయలేదు. ఇక రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కంటే బీజేపీనే యాక్టివ్‌గా ఉందని భావిస్తున్నారట.
ఈ క్రమంలో వంగవీటి కూడా కమల తీర్థం పుచ్చుకోనున్నట్లు చెబుతున్నారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఎంతో ప్రభావవంతమైన వంగవీటి రంగా వారసుడిగా వచ్చిన రాధాకు ఒకవిధంగా కాలం కలసి రావడం లేదు. ఆయన వేసిన రాజకీయ ఎత్తుగడలు బెడిసికొట్టాయి. తప్పుల మీద తప్పులు చేసి తన రాజకీయ జీవితానికి తానే సమాధి కట్టుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. మొత్తం నాలుగు పార్టీలు మారిన వంగవీటి రాధా.. ఇప్పుడు బీజేపీలో చేరాలని భావిస్తున్నారట.
తొలుత కాంగ్రెస్‌లో ఉన్న ఆయన.. ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత వైసీపీలో చేరి పని చేశారు. రంగా లెగసీ తనకు ఎన్నటికీ ఉంటుందని, తనకు బలమైన సామాజికవర్గం అండగా ఉంటుందని భావించిన వంగవీటి రాధా వరుసగా టర్న్‌లు తీసుకుంటూ రావడంతో రాజకీయంగా ఎదగలేకపోయారు. ప్రజల నాడిని పసిగట్టడంలో పూర్తిగా రాధా విఫలమయ్యారు.
వంగవీటి రాధా తొలుత కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే కాగలిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరోసారి టిక్కెట్ ఇస్తామని చెప్పినా, మంత్రి పదవి దక్కుతుందని హామీ ఇచ్చినా రాధా పెడచెవిన పెట్టి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి ఓటమి పాలయ్యారు. అప్పుడు తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వైసీపీలో చేరారు.
వైసీపీలో దాదాపు నాలుగేళ్ల పాటు ఉన్న వంగవీటి రాధా… కేవలం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ కోసం పట్టుబట్టి ఆ పార్టీని వీడాల్సి వచ్చింది. వంగవీటి రాధాను బుజ్జగించేందుకు చివరి నిమిషం వరకూ జగన్ పార్టీ ప్రయత్నించింది. వేరే స్థానం నుంచి టికెట్ కేటాయించేందుకు కూడా సిద్ధమైంది. మచిలీపట్నం పార్లమెంటు సీటు నుంచి పోటీ చేయాలని వైసీపీ పెద్దలు సూచించారు. అప్పుడు రాధా ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదు.
పార్టీని వీడి ఎమ్మెల్సీ స్థానం ఇస్తామనే హామీతో తెలుగుదేశంలో చేరారు. మచిలీపట్నం నుంచి పోటీ చేసి ఉంటే తప్పకుండా వైసీపీ వేవ్‌లో గెలిచేవారని అంటారు. టీడీపీ తరఫున అనకాపల్లి నుంచి పోటీ చేయాలని చెప్పడంతో అందుకు రాధా అంగీకరించలేదు. టీడీపీ తరపున కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే తాను ఎమ్మెల్సీ అవుతానని రాధా భావించారు. తీరా పరిస్థితులు తారుమారయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చింది.
కొన్నాళ్ల పాటు యాక్టివ్‌గానే కనిపించిన రాధా.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు తెలుగుదేశానికి కూడా దూరంగా ఉంటున్నారు. తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధవుతున్నారని అంటున్నారు. ప్రతి విషయంలోనూ ఇప్పటి వరకూ తప్పటడుగులు వేస్తూ వచ్చిన రాధా… ఈసారైనా సక్సెస్‌ఫుల్ అవుతారామరి ఆయన నిర్ణయాలు స్థిరంగా ఉండవనే అభిప్రాయాలున్న నేపథ్యంలో ఆయన వెంట అనుచరులు ముందుకు నడుస్తారా లేదా అన్నది చూడాలి.