VV Lakshminarayana
VV Lakshminarayana: జేడీ లక్ష్మీనారాయణ. తెలుగు స్టేట్స్‌లోనే కాదు..పక్క రాష్ట్రాల్లోనూ ఈ పేరు చాలా పాపులర్. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌గా, సీబీఐ ఆఫీసర్‌గా..నిజాయితీకి మారుపేరుగా ఆయన పేరు ఒకప్పుడు మార్మోగింది. నిజానికి జేడీ అనేది ఆయన ఇంటిపేరు కాదు. ఆయన ఇంటిపేరు వాసగిరి. లక్ష్మీనారాయణకు ముందు వెంకట అని ఉంటుంది.
వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ. షార్ట్‌గా వీవీ అని పిలిచేవారు. కానీ ఆయన జాబ్ పరంగా సీబీఐ జేడీగా పనిచేయడంతో.. లక్ష్మీనారాయణ ఇంటిపేరు జేడీలా మారిపోయింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో పలు అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టి..దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఓబుళాపురం మైనింగ్, జగన్ అక్రమాస్తుల కేసు విచారణ, అరెస్టులతో లక్ష్మీనారాయణ లైమ్‌లైట్‌లో నిలిచారు.
అయితే పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్‌తో 2018లో ఉద్యోగానికి స్వచ్చందంగా పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో ఆయన విశాఖ నుంచి లోక్‌సభకు ఎంపీగా జనసేన తరఫున పోటీ చేశారు. దాదాపుగా 2 లక్షల 75 వేల దాకా ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో ఓడిన తర్వాత జనసేనను వదిలేశారు. ఇక 2024 ఎన్నికల్లో జై భారత్ పార్టీని స్థాపించి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడారు జేడీ. అప్పటినుంచి జై భారత్ పార్టీ గురించి పెద్దగా మాట్లాడింది లేదు.
Also Read: గుడ్‌న్యూస్.. రైతులు బ్యాంక్ ఖాతాలు వెంటనే చెక్ చేసుకోండి..
కొన్నాళ్లు పొలిటికల్ ఎనలిస్ట్‌గా కనిపించిన ఆయన సడెన్‌గా కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త జాబ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే జేడీ లక్ష్మీనారాయణ పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పినట్లే అన్న చర్చ జరుగుతోంది. నిజానికి మార్పు కోసం..సిన్సియర్ పాలిటిక్స్ కోసం..యువత, రైతులు సెంట్రిక్‌గా తన వంతు ప్రయత్నం చేశారు జేడీ లక్ష్మీనారాయణ. కానీ ప్రజెంట్ పాలిటిక్స్‌లో ఆయన ఎత్తుకున్న ఎజెండా వర్కౌట్ కాలేదు.
ఎంత మంచి పేరున్నా ఫలితాలు రాలేదు
ధన ప్రవాహం, కులమే ప్రధాన అస్త్రంగా కొనసాగుతున్న ఎన్నికల సమరంలో..ఆయన నెట్టుకురాలేకపోయారన్న అభిప్రాయాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఆయనకు ఎంత మంచి పేరున్నా అనుకున్న ఫలితాలు సాధించలేకపోయారు. జేడీనే కాదు గతంలో ఐఏఎస్ ఆఫీసర్‌గా పనిచేసి లోక్‌సత్తా పార్టీ పెట్టిన జయప్రకాశ్ నారాయణ తాను కూకట్‌పల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ రాజకీయంగా, పాలనా పరంగా అనుకున్న మార్పులు తేలేక ఆయన కూడా యాక్టీవ్ పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పారు.
అయితే కొందరు ప్రాంతీయ పార్టీలు పెట్టి..ఎవరు అధికారంలో ఉంటే వారికి మద్దతుగా మాట్లాడి ఎప్పుడూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తుంటారు. ప్రతీసారి ఎన్నికలప్పుడు హడావుడి చేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోతుంటారు. అవసరాలు, లాబీయింగ్‌లు, వ్యక్తిగత పనులు, పైరవీలే ఎజెండాగా పార్టీలు నడుపుతున్నవారు లేకపోలేదు. బీఫామ్‌లు అమ్ముకుని పార్టీలు నడుపుతున్నవారున్నారన్న విమర్శలు ఉన్నాయి. కానీ జేడీ లక్ష్మీనారాయణ సిన్సియర్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం చేశారు. తాను గెలవకపోగా పార్టీని నడపటంలోనూ..మిగతా వాళ్లలాగా ఎజెండాలు మార్చుకోలేకపోయారు. దాంతో ఆయన కొత్త రోల్‌లోకి వెళ్లిపోవాల్సి వచ్చిందన్న చర్చ జరుగుతోంది.
జేడీ జాబ్‌లో చేరారు. ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారని అంటున్నారు. ఈ విషయాన్ని ఈవీ ట్రాన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. జేడీ గతంలో కూడా ట్రాన్స్‌పోర్టు ఫీల్డ్‌లో పనిచేశారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ డిగ్రీ పొందిన జేడీ ఆ తర్వాత ఎంటెక్ చదివారు. ఐపీఎస్ ఉద్యోగంలోకి చేరడానికి ముందు అశోక లేల్యాండ్‌లో పనిచేశారని అంటున్నారు. ఇప్పుడు కూడా ఆయన అదే ఫీల్డ్‌లోకి వచ్చారు.
సరికొత్త జీవితాన్ని ఆరంభించనున్న జేడీ
దేశవ్యాప్తంగా పేరున్న భారీ సంస్థలో చేరడం ద్వారా జేడీ సరికొత్త జీవితానికి తెర తీశారన్న చర్చ జరుగుతోంది. ఆయన చేరిన ఈవీట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌కు ఒక అనుబంధ సంస్థగా ఉంది. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నత హోదాలోకి జేడీ వెళ్లారని అంటున్నారు. జేడీకి ఈ ఫీల్డ్‌లో అపారమైన అనుభవం ఉంది.
ఎస్పెషల్‌గా కమర్షియల్ వెహికల్ సిస్టమ్‌పై ఎంతో అవగాహన ఉందని అంటారు. ఈవీ ట్రాన్స్ సంస్థ ఎలక్ట్రిక్ బస్సుల తయారీని పెద్దఎత్తున చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు జేడీ వంటి సీనియర్ అనుభవం కలిగిన వారి అండ దొరికిందని అంటున్నారు. అందుకే ఆయనకు ఉన్నత స్థానం ఇచ్చి తమ సంస్థలోకి ఆహ్వానించిందని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఆయన మళ్లీ రాజకీయాల గురించి ఆలోచిస్తారా అన్న చర్చ సాగుతోంది. యువతకు ఒక స్పూర్తిగా పాలిటిక్స్ చేయాలనుకున్నప్పటికీ..ప్రజెంట్ పాలిటిక్స్‌లో నెట్టుకురాలేకపోయారు. దాంతో ఆయన ఈ దిశగా తన ఆలోచనలు మార్చుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. 2029 ఎన్నికల నాటికి జేడీ రాజకీయ తెరమీద కనిపిస్తారో లేదో చూడాలి.