Visakhapatnam Airport Close : విశాఖ ఎయిర్‌పోర్టు పరిస్థితి ఏంటి? దాన్ని మూసేస్తారా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Visakhapatnam Airport Close : భోగాపురం విమానాశ్రయంలో ఈనెల 17వ తేదీ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. దీంతో విశాఖపట్టణం ఏయిర్ పోర్టు ఆగస్టు 16వ తేదీ అర్ధరాత్రి నుంచి మూతపడనుంది. ఈ విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
- Harish Thanniru
- Published on- August 1, 2026 / 11:07 AM IST
Visakhapatnam Airport Close
Visakhapatnam Airport Close : విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కానుంది. ఈ విమానాశ్రయంలో ఈనెల 17వ తేదీ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. దీంతో విశాఖపట్టణం ఏయిర్ పోర్టు ఆగస్టు 16వ తేదీ అర్ధరాత్రి నుంచి మూతపడనుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక గెజిట్ విడుదల చేసింది.
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం ప్రతిపాదన సమయంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ మేరకు ఒప్పందం జరిగింది. అయితే, తాజాగా కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో.. భోగాపురం విమానాశ్రయంలో విమానరాకపోకలు ప్రారంభమైన వెంటనే అంటే.. 17వ తేదీ నుంచి 30ఏళ్ల పాటు విశాఖ విమానాశ్రయం (ఐఎన్ఎస్ డేగ) నుంచి పౌర విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో విశాఖ పట్టణంకు కేటాయించిన ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్టు కోడ్ ‘వీటీజెడ్‌ను అల్లూరి విమానాశ్రయానికి బదలాయిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ పేర్కొంది.
విశాఖపట్నం విమానాశ్రయంలో ఆగస్టు 17 నుంచి సాధారణ పౌర విమాన సర్వీసులు నిలిచిపోనున్నప్పటికీ, నాన్‌షెడ్యూల్డ్ విమాన సేవలు యథావిధిగా కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయం భారత నౌకాదళం (నేవీ) ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఈ విమానాశ్రయాన్ని ఒకవైపు నేవీ, మరోవైపు పౌర విమానయాన శాఖ సంయుక్తంగా వినియోగిస్తున్నాయి. అయితే ఆగస్టు 17 నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమాన సర్వీసులు నిలిపివేయనున్న నేపథ్యంలో, నాన్‌షెడ్యూల్డ్ విమానాల నిర్వహణపై కేంద్రం స్పష్టత ఇచ్చింది.
ప్రైవేటు సంస్థలకు చెందిన చార్టర్డ్ విమానాలు, అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వీవీఐపీలు, ఉన్నతాధికారులు ప్రయాణించే ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకోవచ్చు. వాటి ల్యాండింగ్, టేకాఫ్‌లకు ఎలాంటి ఆటంకం ఉండదని కేంద్రం తెలిపింది. సాధారణ ప్రయాణికుల కోసం షెడ్యూల్డ్ విమాన సర్వీసులు నిలిచిపోయినా, ప్రత్యేక అవసరాల కోసం నాన్‌షెడ్యూల్డ్ విమాన కార్యకలాపాలు విశాఖ విమానాశ్రయంలో కొనసాగనున్నాయి. దీంతో ప్రభుత్వ, కార్పొరేట్, అత్యవసర అవసరాల కోసం విమానాశ్రయం సేవలు అందుబాటులోనే ఉంటాయి.
