Pawan Kalyan: వైసీపీ నాయకులు జైలుకెళ్లాలని నేనెందుకు కోరుకుంటాను? వాడుకుంది చాలు.. ఇక ఆపేయండి- పవన్ కల్యాణ్ ఫైర్

దేనికైనా ఓ హద్దు ఉంటుందన్న పవన్.. రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికారు. చూస్తూ ఊరుకుంటానని అనుకోవద్దని స్పష్టం చేశారు.

  • Updated on- May 25, 2026 / 09:28 PM IST

Pawan Kalyan: వైసీపీ నాయకులు జైలుకి వెళ్లాలని నేనెందుకు కోరుకుంటాను అని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఒకరు జైలుకి వెళ్తే పవన్, జనసేన ఎదుగుతుందా? అని నిలదీశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తాను మాట్లాడినవి బయటకు ఎలా తెలుస్తాయన్నారు. అసలు అమిత్ షాతో ఇలాంటివి మాట్లాడతామా? మరో అంశం ఉండదా? అని నిలదీశారు. మీ ఎదుగుదల కోసం ఇన్నాళ్లు పవన్ కల్యాణ్ ని వాడుకున్నది చాలు.. ఇక ఆపేయండి.. ఇక చూస్తూ ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.

రాజకీయ పార్టీ నడపడం అంత సులువు కాదన్నారు పవన్ కల్యాణ్. తనతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన విషయాలు బయటవాళ్లకు ఎలా తెలుస్తాయి అని ప్రశ్నించారు. ఈ అంశంపై ఏపీ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని క్వశ్చన్ చేశారు. వైసీపీ నాయకుడు జైలుకి వెళ్లాలని నేను ఎందుకు కోరుకుంటాను? ఒకరు జైలుకి వెళ్తే పవన్, జనసేన ఎదుగుతుందా? నేను పదే పదే కులం గురిచి మాట్లాడతానని అంటున్నారు. నేను ఎప్పుడైనా కుల నాయకుడినని చెప్పానా? మిగతా నాయకులు కులం గురించి మాట్లాడటం లేదా? కులాలను రెచ్చగొట్టడం మంచిది కాదు అని పవన్ వ్యాఖ్యానించారు.

ఇకపై భరించే ప్రసక్తే లేదు..

ఇప్పటివరకు అన్నీ భరించా, ఇకపై భరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మాకూ కోపాలు, బాధలు ఉంటాయి.. చూస్తూ ఊరుకుంటానని అనుకోవద్దని స్పష్టం చేశారు. దేనికైనా ఓ హద్దు ఉంటుందన్న పవన్.. రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికారు. కష్టాలు, కన్నీళ్లు మీకే ఉంటాయా? అని అన్నారు. ఇకపై జనసేన కార్యాచరణ చాలా బలంగా ఉంటుందని రాజమండ్రిలో జనసేన నేతలతో జరిగిన మీటింగ్ లో పవన్ కల్యాణ్ అన్నారు.

”నేను అంత దిగజారిపోలేదు. వైసీపీ నాయకులను జైలుకి పంపేందుకు నేను రాజకీయాల్లోకి రాలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను నా తుపాకీ సరెండర్ చేసి రాజకీయాల్లోకి వచ్చాను కదా. నా గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు. ఎంత తెగింపు గుణం ఉంటే నేను రాజకీయాల్లోకి వస్తాను. అలాంటి నేను అమిత్ షాని కూర్చోపెట్టి వైసీపీ నాయకుడిని జైలుకి పంపించాలని నేను చెప్పానని ఈయన ఊహించుకుని చెప్పారు. అదో పెద్ద న్యూస్.

మీ కళ్లకు సమస్యలు కనిపించడం లేదా? ఎంత సేపు వైసీపీ నాయకుడు, జైళ్లు ఇవేనా? ప్రధాని మోదీ, అమిత్ షా ను కలిస్తే మాట్లాడితే మాకు వేరే సమస్యలు ఉండవా? దేశ భవిష్యత్తు గురించి మాట్లాడమా, ఏపీ అభివృద్ది గురించి మాట్లడమా? వాళ్లని జైల్లో పెట్టండి, వీళ్లని జైల్లో పెట్టండి, వీళ్ల నడుముకి బెల్ట్ కట్టేయండి, వాళ్లకి గొలుసులు వేయండి.. ఇవే చెప్తామా? ఎవరు నేరం చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాలా? కర్మ ఎవరినీ వదలదు. ఎవరు చేసిన పనులు వాళ్లకు తగులుతాయి. దయచేసి నన్ను వాడుకోకండి. మీ పెరుగుదల కోసం మీ ఎదుగుదల కోసం పవన్ కల్యాణ్ అనే వ్యక్తిని వాడుకున్నది చాలు.. ఇక ఆపేయండి..” అని పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.

Also Read: 100 యునికార్న్ సంస్థల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నాం- సీఎం చంద్రబాబు