Udayagiri YCP : ఉదయగిరి వైసీపీలో ఎన్నాళ్లీ స్తబ్ధత.. మేకపాటి రాజగోపాల్‌రెడ్డిపై క్యాడర్‌ అసంతృప్తిగా ఉందా.?

Udayagiri YCP : మేకపాటి రాజగోపాల్ రెడ్డి కంటే ఆయన తనయుడు అభినవ్ రెడ్డి బెటర్ అనే చర్చ ఉదయగిరి నియోజకవర్గ వైసీపీలో సాగుతోందట. అభినవ్ రెడ్డికి యువతలో మంచి ఆదరణ ఉందని వైసీపీ క్యాడర్ చర్చించుకుంటుందట.

Udayagiri YCP

Udayagiri YCP : నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీకి అన్నీ ఉన్నా అదొక్కటే లోటు అన్నట్లు ఉందట పరిస్థితి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మేకపాటి కుటుంబం రాజకీయంగా ప్రభావం చూపుతూ వచ్చింది. గత ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పార్టీ అధిష్టానం ఆయనను పక్కన పెట్టింది. ఆయన టీడీపీలో చేరడంతో.. 2024 ఎన్నికల్లో మేకపాటి సోదరుల్లో ఒకరైన మేకపాటి రాజగోపాల్ రెడ్డికి వైసీపీ టికెట్ ఇచ్చింది. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాకర్ల సురేష్ చేతిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలయ్యారు. అయితే గత ఎన్నికల్లో పరాజయం తర్వాత ఉదయగిరిలో వైసిపి పరిస్థితి దారుణంగా మారిందట.

Also Read : Rajya Sabha Battle in AP : ఏపీ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టేదెవరు? బీజేపీకి డౌటేనా.. టీడీపీ నుంచి వారికే చాన్స్..! కొనసాగుతున్న సస్పెన్స్..

క్యాడర్‌ స్ట్రాంగ్‌గా ఉన్నా..పార్టీ బలంగా ఉన్నా..పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేసే నాయకులు లేక ఇబ్బంది పడాల్సి వస్తోందట. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలను కూడా తక్కువే నిర్వహిస్తున్నారట. క్షేత్రస్థాయిలో యాక్టివ్‌గా లేకపోవడంతో కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొందట. నియోజకవర్గ ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తీరు కూడా క్యాడర్‌ను పార్టీకి దూరం చేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డికి బలమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ బలం ఉన్నప్పటికీ దానిని పార్టీ బలోపేతానికి ఉపయోగించడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదిలాఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో భూకబ్జాలు, అక్రమ గ్రావెల్ తవ్వకాలు, అక్రమ లేఔట్లు, అగ్రిగోల్డ్ భూముల వ్యవహారాలు అంటూ అనేక అంశాలు తెరమీదకు వచ్చాయి. కానీ, వైసీపీ వీటిని క్యాష్ చేసుకుని అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టడంలో సక్సెస్ కాలేకపోయిందని సొంత పార్టీ క్యాడరే చర్చించుకుంటున్న పరిస్థితి. ఉదయగిరి నియోజకవర్గంలో అసలు ప్రతిపక్షమే లేదని అధికార పార్టీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విమర్శించాడoటే..ఈ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు. మేకపాటి రాజగోపాల్‌రెడ్డి దూకుడుగా వ్యవహరించడం లేదని.. కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే క్విక్‌గా రియాక్ట్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

మేకపాటి రాజగోపాల్ రెడ్డి కంటే ఆయన తనయుడు అభినవ్ రెడ్డి బెటర్ అనే చర్చ ఉదయగిరి నియోజకవర్గ వైసీపీలో సాగుతోందట. అభినవ్ రెడ్డికి యువతలో మంచి ఆదరణ ఉందని వైసీపీ క్యాడర్ చర్చించుకుంటుందట. ఉదయగిరి, వింజమూరు, కొండాపురం, సీతారాంపురం, జలదంకి మండలాల్లో పార్టీ బలంగా ఉన్నప్పటికీ వరికుంటపాడు, దుత్తలూరు, కలిగిరి, మండలాల్లో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడంతో కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారని స్థానిక నేతలే చెబుతున్నారు. కొన్ని మండలాల్లో నాయకుల ఒంటెద్దు పోకడలతో పార్టీ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని బాధపడుతున్నారు కార్యకర్తలు. ఉదయగిరి వైసీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి మరి.