Rajya Sabha Battle in AP : ఏపీ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టేదెవరు? బీజేపీకి డౌటేనా.. టీడీపీ నుంచి వారికే చాన్స్..! కొనసాగుతున్న సస్పెన్స్..
Rajya Sabha Battle in AP : ఏపీ నుంచి బీజేపీకి ఈసారి అవకాశం ఇస్తారా లేదా అనేది ఎన్డీయే సమావేశంలో స్పష్టత రానుంది. బీజేపీ కేంద్ర నాయకత్వం గట్టిగా పట్టుబడితే మాత్రం చంద్రబాబు నాయుడు కాదనలేని పరిస్థితి ఉండొచ్చు. కానీ బీజేపీకి ఒక రాజ్యసభ స్థానం ఇస్తారా? లేదా? అనేది మాత్రం చివర వరకూ సస్పెన్స్ కొనసాగే అవకాశాలున్నాయి.
Rajya Sabha Battle in AP
Rajya Sabha Battle in AP : పెద్దల సభలో పూర్తిస్థాయి పట్టు సాధించేందుకు ఎప్పటి నుంచో వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేందుకు పావులు కదుపుతోంది. అయితే, ఏపీ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్న వేళ ఈసారి బీజేపీకి సీటు ఇవ్వలేమని టీడీపీ సంకేతాలు ఇస్తోందట. ఇదే సమయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు టాక్.
ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ సీట్ల భర్తీకి సుదీర్ఘంగా కసరత్తే చేస్తోంది. 24 స్థానాల్లో 11సీట్లలో బీజేపీ నేరుగా అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్డీయే మిత్రపక్షాల అభ్యర్థులు ఆరు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలు కూటమికే దక్కనుండటంతో.. మూడు పార్టీలు ఈ సీట్ల షేరింగ్పైన కసరత్తు చేస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ నుంచి ఇద్దరు బీజేపీ అభ్యర్ధులు రాజ్యసభకు ఎంపిక అయ్యారు. దీంతో.. ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వలేమని టీడీపీ అధినాయకత్వం ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లుగా ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. టీడీపీ మూడు..జనసేన ఒక సీటు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్డీఏ సమావేశంలో రాజ్యసభ సీట్లపై క్లారిటీ రానుంది. జనసేనకు ఒక స్థానం కేటాయించడం పక్కా అని అంటున్నారు. ఆ సీటు లింగమనేని రమేష్‌కు దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కూటమి అభ్యర్దిగా ఏపీ నుంచి మాజీ ప్రధాని దేవెగౌడతో సహా మరో ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నారట. కర్ణాటక నుంచి దేవెగౌడ రాజ్యసభకు 2020లో ఎంపికై.. ఇప్పుడు పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ, జేడీఎస్ పొత్తులో భాగంగా దేవగౌడకు సీటు ఇవ్వాలని బీజేపీపై ఒత్తిడి ఉందట. కమలం పార్టీ అగ్రనేతలు మాత్రం మాజీ మంత్రి సదానందగౌడ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దేవెగౌడకు అవకాశం కల్పించకపోతే అన్నామలై.. మందకృష్ణ మాదిగలో ఒకరికి ఏపీ నుంచి అవకాశం దక్కొచ్చన్న చర్చ జరుగుతోంది. ఏపీ నుంచి ఎలాగైనా ఒక సీటు దక్కించుకోవాలని బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తోందని అంటున్నారు.
ఏపీ నుంచి బీజేపీకి ఈసారి అవకాశం ఇస్తారా లేదా అనేది ఎన్డీయే సమావేశంలో స్పష్టత రానుంది. బీజేపీ కేంద్ర నాయకత్వం గట్టిగా పట్టుబడితే మాత్రం చంద్రబాబు నాయుడు కాదనలేని పరిస్థితి ఉండొచ్చు. కానీ బీజేపీకి ఒక రాజ్యసభ స్థానం ఇస్తారా? లేదా? అనేది మాత్రం చివర వరకూ సస్పెన్స్ కొనసాగే అవకాశాలున్నాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత మాత్రమే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
మరోవైపు రాజ్యసభ నోటిఫికేషన్ వెలువడటంతో టీడీపీ రాజ్యసభ ఆశావహుల్లో టెన్షన్ కనిపిస్తోంది. చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆశావహులు.. తాము చేసిన సేవలను వివరిస్తున్నారు. అయితే బీజేపీకి ఒక సీటు, జనసేనకు ఒక సీటు ఇస్తే ఇక మిగిలేది రెండే. ఆ రెండింట్లో ఓ సీటును సానా సతీష్‌కు రెన్యూవల్ చేస్తారని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. అదే నిజమైతే కొత్తగా టీడీపీ ఒక్క సీటే దక్కనుంది. అందుకే ఈసారి బీజేపీకి ఒక్క స్థానం కూడా ఇవ్వకుండా మూడు సీట్లు తమకే ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు పట్టుబడుతున్నారట.
టీడీపీకి దక్కే సీట్లు ఎన్నో ఇప్పటికైతే క్లారిటీ లేకపోయినా.. రేసులో కిలారు రాజేష్, కంభంపాటి రామ్మోహన్ రావు, టీడీ జనార్ధన్, గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణ, ఎస్సీ కోటాలో సీనియర్ నేత వర్ల రామయ్య పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి బీసీ కోటాలో చింతకాయల విజయ్, రాయలసీమ నుంచి రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి, బీసీ కోటాలో తిప్పేస్వామి ప్రచారంలో ఉన్నాయి. మరి ఏపీ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టే ఆ అదృష్టవంతులెవరో.? ఈ సారి బీజేపీకి ఏపీ కోటాలో సీటు దక్కుతుందో లేదో అనేది వేచి చూడాలి మరి.
