YS Jagan : సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలి.. డీజీపీ సహా ఆ ముగ్గురి ప్రమేయం : వైఎస్ జగన్
YS Jagan : విజయవాడ కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ నివాసానికి వైఎస్ఆర్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లారు. సాయికృష్ణ తల్లిని పరామర్శించి.. ఆమెను ఓదార్చారు.
- Harish Thanniru
- Updated on- June 18, 2026 / 07:45 PM IST
YCP chief Jagan Mohan Reddy consoles Saikrishnas mother
- సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్ జగన్ పరామర్శ
- ఆమెను ఓదార్చి కుటుంబసభ్యులతో మాట్లాడిన జగన్
- సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్
YS Jagan : సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం ఏపీ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతోంది. ఈ క్రమంలో విజయవాడ కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ నివాసానికి వైఎస్ఆర్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లారు. సాయికృష్ణ తల్లిని పరామర్శించి.. ఆమెను ఓదార్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ సాయికృష్ణ అదృశ్యం ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్ మాట్లాడుతూ.. విజయవాడ నడిబొడ్డున దారుణ ఘటన జరిగింది. సాయికృష్ణ ఘటనలో సీపీ, ఏసీపీ, సీఐతోపాటు డీజీపీకి కూడా సంబంధం ఉంది. మే నెలలోనే ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. సీఐ వేధిస్తున్నాడని క్రాంతి కుమార్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. మే9న సాయికృష్ణను పోలీసులు తీసుకెళ్లారు. తన కొడుకు ఎక్కడున్నాడని ఈ తల్లి పోలీసులను ప్రశ్నించింది. కొడుకును చూపించమని పోలీస్ స్టేషన్ కు వెళ్లని రోజులేదు. నీ కొడుకు ఫొటోకు దండ వేసుకోమని ఆ తల్లికి చెప్పడం చూస్తుంటే.. వీళ్లు ఎంతటి దుర్మార్గానికి పాల్పడ్డారో అర్ధమవుతుందని జగన్ అన్నారు.
సాయికృష్ణ అదృశ్యం విషయాన్ని మరుగున పడేసేందుకు అతని తల్లితో పోలీసులు బేరసారాలు చేశారు. సాయికృష్ణ తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేసింది. కూటమి ప్రభుత్వ పాలనలో ఇలాంటి ఘోరాలను అడ్డుకట్ట వేసేందుకు బాధితులకు మేం సపోర్ట్‌గా నిలబడ్డాం. గత్యంతరం లేక సీఐని సస్పెండ్ చేశారు. సాయికృష్ణను చంపారని ఒప్పుకున్నారు కాబట్టే సీఐని సస్పెండ్ చేశారు. ఒకరి కాదు.. ఇద్దరి చావుకు సీఐ నాగరాజు కారణమయ్యాడు. సీఎం చంద్రబాబు మాత్రం అతన్ని కేవలం సస్పెండ్ మాత్రమే చేశారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీపీ, ఏసీసీ, డీజీపీపై మర్డర్‌కేసు పెట్టాల్సింది పోయి.. కేవలం సీఐ నాగారాజును సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని జగన్ ఆరోపించారు. ఒకవేళ సాయికృష్ణ తప్పుచేసిఉంటే కోర్టులు శిక్షిస్తాయి. కానీ, పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చంపేశారు. సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
