ఆ రోజు ఈ విధంగా మేం చేసిన కృషి వల్లే..: భోగాపురం ఎయిర్‌పోర్టుపై జగన్ స్పందన
ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం భూసేకరణకు తాము సుమారు రూ.960 కోట్లు ఖర్చు చేసినట్లు జగన్ చెప్పుకొచ్చారు.
- T Venkateshwarlu
- Published on- January 4, 2026 / 06:44 PM IST
YS Jagan (Image Credit To Original Source)
- ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్
- జీఎంఆర్ గ్రూప్‌నకు జగన్ అభినందనలు
- తమ హయాంలో వేగంగా అనుమతులు తెచ్చామన్న జగన్
YS Jagan: భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండ్ కావడంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఈ ఎయిర్‌పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ కావడం ఏపీ అభివృద్ధి మార్గంలో ఒక మైల్‌స్టోన్ అని చెప్పారు. విజన్ వైజాగ్ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడిందని అన్నారు.
ఈ విమానాశ్రయ నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జీఎంఆర్ గ్రూప్‌నకు హృదయపూర్వక అభినందనలు చెబుతున్నానని జగన్ అన్నారు. వైసీపీ పాలనా కాలంలో వేగంగా అనుమతులు సాధించడమే కాకుండా, ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం భూసేకరణ కోసం సుమారు రూ.960 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు.
ఈ ప్రాజెక్టుకు తాము బలమైన పునాది వేశామని అన్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రధాన పనుల్లో అధిక భాగం అప్పుడే పూర్తయిందని తెలిపారు. ఆ రోజు తాము చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచిందని అన్నారు.
విశాఖపట్నం పోర్టును భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో అనుసంధానించే బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌కు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కృషి, సహకారం తనకు బాగా గుర్తుందని జగన్ చెప్పారు.
కాగా, అత్యాధునిక టెక్నాలజీతో భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 96 శాతం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లు జీఎంఆర్ సంస్థ తెలిపింది. ఈ ఎయిర్‌పోర్టును జూన్ 26న ప్రారంభిస్తారు.
