YS Jagn : ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్.. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
YS Jagn : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్.. ఎవరివి హత్యా రాజకీయాలు? అంటూ ప్రశ్నించారు. మా కుటుంబంలో ముగ్గురు బలైపోయారు.. మేము బాధితులం.. బలైపోయింది మేము అంటూ జగన్ అన్నారు.
- Harish Thanniru
- Updated on- May 21, 2026 / 12:48 PM IST
YS Jagan sensational comments on CM Chandrababu Naidu
YS Jagn : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్.. ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్.. ఎవరివి హత్యా రాజకీయాలు? అంటూ ప్రశ్నించారు. మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా..? అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నాడు. వైఎస్ఆర్‌ను పులివెందులలో కట్టడి చేయాలని రాజకీయ కోణంతో మా తాతను హత్య చేశారు. నిందితులను హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో దాచికాపాడలేదా? అంటూ జగన్ ప్రశ్నించారు. మా నాన్నను అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను అని చంద్రబాబు అనలేదా? చంద్రబాబు అలా అన్న రెండు రోజులకు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ హెలికాప్టర్ ప్రమాదంపై అనేక అనుమానాలు నివృత్తి కాలేదు. అప్పుడు సీఎంగా చంద్రబాబు ఉన్నారని జగన్ అన్నారు.
చిన్నాన్న వివేకా హత్య జరిగినప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నాడు. హత్య చేసిన దస్తగిరిని నేడు బయటకు తీసుకొచ్చారు. దర్జాగా కారులో తిరుగుతున్నాడంటూ జగన్ చెప్పుకొచ్చారు. మీ వియ్యంకుడు బాలకృష్ణ గన్‌తో కాల్చలేదా.. సాక్షిగా ఉన్న వాచ్‌మ్యాన్‌ను బండరాయితో కొట్టి చంపారు. హరికృష్ణ యాక్సిడెంట్‌లో చనిపోతే.. పరామర్శకు పోయి కేటీఆర్‌తో పొత్తులు గురించి మాట్లాడారు. తండ్రితో సమానమైన ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి సీఎం పదవి, పార్టీ, పార్టీ గుర్తు లాక్కుని ఆయన చావుకు కారణం చంద్రబాబు కాదా..? అంటూ జగన్ ప్రశ్నించారు.
టైగర్ లాంటి వంగవీటి రంగాను అర్ధరాత్రి దారుణంగా నరికి చంపారు.. అప్పుడు సీఎంగా చంద్రబాబు ఉన్నారు. రంగా హత్యలో చంద్రబాబు పాత్రపై హరిరామజోగయ్య తన పుస్తకంలో రాసుకున్నారు. రంగా హత్యలో ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణబాబు టీడీపీ ఎమ్మెల్యే. ఈ సంఘటనలు అన్నింటిలో వేళ్లన్నీ చంద్రబాబుపైనే చూపించాయని జగన్ అన్నారు. చంద్రబాబు కుట్రల గురించి దగ్గుబాటి వెంకటేశ్వరావు పుస్తకంలో వివరంగా రాశారు. జగన్ మంచోడు కనుకనే మా తాత ని చంపిన వాళ్ళు ఈరోజు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. జగన్ చెడ్డవాడు అయితే వాళ్లంతా బతికి ఉండేవారా..? వాళ్ళకు ఎప్పటికీ నా నుండి హాని జరగదని జగన్ అన్నారు.
హత్యలు, కుట్రలు చేసి రాజకీయాలు చెయ్యడం మా నాన్న నాకు నేర్పించలేదు. మా నాన్న విలువలు, విశ్వసనీయతతో రాజకీయాలు చెయ్యడమే నేర్పించాడు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. ఈ వయసులో ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడం సిగ్గు అనిపించడం లేదా..? అంటూ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నాడు..
రాష్ట్రంలో ప్రజలు బతుకు బండిని నడపడానికి అష్టకష్టాలు పడుతున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు గాలికివదిలేసి.. అవినీతి, దోపిడీ, మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క మంచి చేసినట్టు చెప్పుకునే పరిస్థితి లేదు. రెండేళ్ల పాలనలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కనిపిస్తుంది. రెండేళ్లుగా విచ్చలవిడిగా దౌర్జన్యాలు.. అవినీతి, దోపిడీ చేస్తూనే ఉన్నారు. ప్రజా సమస్యలు ఏవైనా బయటికి వస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏదైనా ప్రజా సమస్య బయటికి వస్తే చంద్రబాబుకి బీపీ పెరుగుతుంది. మావిగన్ అని ఎవరైనా అంటుంటే చంద్రబాబుకి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. చంద్రబాబు రాష్ట్రానికి ఎన్నటికీ రాజధాని లేకుండా చంద్రబాబు చేస్తున్నారు అంటూ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
