Jagan Warning
Ys Jagan: ఎల్లకాళం మీ ప్రభుత్వమే ఉండదు.. మూడేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. వడ్డీతో సహా చెల్లిస్తాం. తప్పు చేసిన వారిన న్యాయపరంగా శిక్షిస్తాం అంటూ కూటమి ప్రభుత్వానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. అంతేకాదు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక దెబ్బతిన్న మా వాళ్లు ఊరుకుంటారా? మా వాళ్లు కూడా ఇలానే స్పందిస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి.. అని జగన్ సీరియస్ అయ్యారు.
గుంటూరుకి వెళ్లిన జగన్.. వైసీపీ నేత అంబట రాంబాబు ఇంటికి వెళ్లారు. అంబటి రాంబాబు ఇంటిని పరిశీలించారు. అంబటి కుటుంబసభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తోందని, భయానక వాతావరణంలో పాలన జరుగుతోందని జగన్ విరుచుకుపడ్డారు.
అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చూస్తుంటే.. జంగిల్ రాజ్యం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందన్నారు జగన్. అంబటి రాంబాబు, జోగి రమేశ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన తప్పేంటి..? అని జగన్ నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని మా వాళ్ళపై దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
”చంద్రబాబు కుట్రపూరితంగా జంతువుల కొవ్వు అని తప్పుడు ప్రచారం చేశారు. ఆవు, పంది, చేప కొవ్వు అంటూ ఉద్దేశ్యపూర్వకంగా దేవుడి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబు, పవన్ కు దేవుడంటే భయం భక్తి లేవు. దుర్మార్గంగా తప్పుడు ప్రచారం చేశారు. ఎలాంటి జంతువుల కొవ్వు లేదని కేంద్ర ల్యాబ్ లు రిపోర్ట్ ఇచ్చాయి. సీబీఐ అదే విషయాన్ని సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చింది. తప్పు చేసి ఉంటే వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి పేర్లు సీబీఐ ఎందుకు చేర్చలేదు. సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. అసలు సీబీఐ విచారణ కావాలని సుప్రీంకోర్టును కోరిందే వైవీ సుబ్బారెడ్డి.
చంద్రబాబు, లోకేశ్, పవన్ చెంపలేసుకుని క్షమాపణ కోరాలి. క్షమాపణ చెప్పకుండా మళ్లీ అదే దుర్మార్గపు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. సిగ్గు లేకుండా ఫ్లెక్సీ లు వేయిస్తున్నారు. కులమతాలను రెచ్చగొట్టే ఫ్లెక్సీలు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం కాదా? ఇలానే మేము సూపర్ సిక్స్ అమలు చెయ్యలేదని ఫ్లెక్సీలు వేస్తే ఒప్పుకుంటారా? ఫ్లెక్సీలు పెట్టి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేలా చెయ్యడం తప్పు కాదా? ఇలాంటి దుర్మార్గాలను ప్రశ్నిస్తే మా వాళ్ళపై దాడులు చేయిస్తారా?
చంద్రబాబుకి మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని కోరి గుడి నుండి వస్తుంటే దాడులు చేశారు. పోలీసుల సమక్షంలోనే కర్రలు పట్టుకుని అంబటి రాంబాబు కారుపై దాడికి పాల్పడ్డారు. కారులో ఉన్న రాంబాబుని దారుణమైన బూతులు తిడుతూ దాడి చేశారు. ఒక్కడే ఉండటం వల్ల అంబటి రాంబాబు ఆగ్రహానికి గురయ్యారు. అలాంటి సమయంలో నోట్లో నుండి రెండు తిట్లు వచ్చాయి. ప్రాణం మీదకి వచ్చినప్పుడు వచ్చిన తిట్లే తప్ప ఉద్దేశ్యపూర్వకంగా తిట్టలేదు. సంస్కారం ఉన్న వ్యక్తి కనుక ఆ మాటలు రావడంపై బాధపడి వివరణ ఇచ్చారు. తిట్లు వచ్చినందుకు చింతిస్తూ వెనక్కి తీసుకున్నారు.
అలాంటి సంస్కారం ఉన్న అంబటిని చేతనైతే పొగడాలి. కానీ, దుర్మార్గంగా హత్య చెయ్యడానికి ప్రయత్నించారు. ఏకంగా 8 గంటలు హత్యకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో పోలీసుల సమక్షంలో దాడి చేశారు. ఇంట్లో మహిళలను ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఫర్నీచర్ పగలగొట్టారు. కార్లు ధ్వంసం చేసి ఆఫీస్ కి నిప్పు పెట్టారు.
పక్కా ప్లాన్ ప్రకారమే హత్యాయత్నం..!
పోలీసులు బాధ్యతగా వ్యవహరించి ఉంటే ఇలాంటి దాడులు జరిగేవా? జీడీపీ ఆఫీస్ కూతవేటు దూరంలో ఉంది. పక్కనే బెటాలియన్ ఉంది. కంట్రోల్ చెయ్యలేరా? అధికారులకు ఫోన్లు చేసినా ఒక్కరూ ఎత్తలేదు. పక్కా ప్లాన్ ప్రకారం హత్యాయత్నం చేశారు. అంబటి రాంబాబును ఎందుకు అరెస్ట్ చేశారు..? మరి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యేపై చర్యలేవి..? తూతూమంత్రంగా అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు.. ఇది జంగిల్ రాజ్యం కాదా..?
పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులేసి జోగి రమేశ్ ఇల్లు తగలబెట్టారు. మా వాళ్ళపై దాడులు చేసి.. వాళ్ళ పైనే రివర్స్ కేసులు పెట్టారు. చంద్రబాబు పాపాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. చంద్రబాబు చేసిన తప్పునకి దేవుడే సీబీఐతో మొట్టికాయలు వేయించాడు. కాపు కులంలో అంబటి ఒక టైగర్. గొప్పగా బతికాడు. విలువలతో కూడిన వ్యక్తిత్వం కలవాడు. సీనియర్ లీడర్, మాజీమంత్రి. స్టేషన్ లో అలాంటి వ్యక్తిని కొడతారా?
ఎప్పుడూ మీ ప్రభుత్వమే ఉండదని గుర్తు పెట్టుకోండి. మూడేళ్ళల్లో మా ప్రభుత్వం వస్తుంది. జాగ్రత్త. వడ్డీతో సహా చెల్లిస్తాం. తప్పు చేసిన వాళ్ళని న్యాయ పరంగా బొక్కలో పెట్టి బుద్ధి చెప్తాం. దెబ్బతిన్న మా వాళ్ళు రేపు ఊరుకుంటారా? మేము వచ్చాక మా వాళ్ళు ఇలానే స్పందిస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఇలాంటి ఘటనలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపు కూడా ఇస్తాం. కేంద్ర స్థాయిలో మీ పాపాలు తీసుకెళ్తాం. సీబీఐ రిపోర్ట్ ఇచ్చాక మళ్లీ కమిటీలు ఏంటి..? చేసిన తప్పు బయటపడేసరికి కమిటీ అంటున్నారు” అని విరుచుకుపడ్డారు జగన్.
Also Read: హిందుత్వ స్లోగన్.. విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చేశారా?