ఏపీలో మరో పథకానికి శ్రీకారం..వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా..రైతుల ఖాతాల్లో రూ.1,252 కోట్లు జమ

  • Publish Date - December 15, 2020 / 07:25 AM IST

YSR Free Crop Insurance Scheme : ఏపీ ప్రభుత్వం ఇవాళ మరో పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. రైతులకు దీమా కల్పించేందుకు…. వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమాను ప్రారంభించనుంది. సీఎం జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆరుగాలం కష్టపడి పంట సాగుచేస్తే… తీరా చేతికొచ్చే సమయంలో అతివృష్టి, అనావృష్టితోపాటు కరువుకాటకాలు, ప్రకృతి వైపరీత్యాలతో రైతుకు నష్టం వాటిల్లితోంది. రైతులందరికీ దీమా కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం…. పంటల బీమా పథకానికి శ్రీకారం చుట్టింది.

పాదయాత్రలో రైతులకు జగన్‌ ఇచ్చిన హామీల మేరకు..ఈ పథకాన్ని ప్రారంభిస్తోంది. 2019లో పంటనష్టపోయిన తొమ్మిదిన్నర లక్షల మంది రైతులకు బీమా పరిహారాన్ని అందించనుంది. ఇందుకోసం 1252 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. సీఎం జగన్‌… క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు.

ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామంలో సాగు చేసిన పంటల వివరాలను ఈ-క్రాప్‌లో నమోదు చేసి బీమా సౌకర్యం కల్పిస్తోంది. అంతేకాదు.. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు ఆ నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించే ఏర్పాటు చేసింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. రైతులు స్వయంగా పరిశీలించుకునేందుకు వీలుగా రైతు భరోసా కేంద్రాల్లో ఈ-క్రాప్‌ వివరాలతో సహా లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించారు.

2019-20లో 49.81 లక్షల మంది రైతులకు చెందిన 45.96 లక్షల హెక్టార్లకు పంటల బీమాను వర్తింప చేసింది. ఇందుకోసం రైతులు చెల్లించాల్సిన 468 కోట్ల ప్రీమియంను కూడా ప్రభుత్వమే భరిస్తూ మొత్తం 971.23 కోట్లు చెల్లించింది.