YS Jagan Mohan Reddy : ఎక్కడ అన్యాయం జరిగినా ‘డిజిటల్ డైరీ’లో నమోదు చేయండి.. అందరి లెక్కలు తేలుస్తాం

YS Jagan Mohan Reddy : గ్రేటర్ విశాఖకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు.

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy : గ్రేటర్ విశాఖకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, స్థానిక రాజకీయ పరిణామాలపై నేతలతో ఆయన చర్చించారు.

Also Read : Train Accident : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు మృతి

ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నేతలు, కార్యకర్తలకు జగన్ పలు సూచనలు చేశారు. ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లాలని, గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో జరుగుతున్న ప్రజావ్యతిరేఖ విధానాలను కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ ఆధారపడటం మొత్తం పోలీసులపైనే ఉందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా పోలీసులను ఉపయోగిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. పోలీసులు ఎవరికీ అన్యాయం చేయకుండా.. ప్రజలు స్వేచ్ఛగా తమ తీర్పును ఇచ్చేలా సహకరించాలని కోరారు.

మీ ధర్మం మీరు చేయండి. మీ టోపీపై ఉన్న సింహాలకు మాత్రమే తలవంచండి.. చంద్రబాబుకు తలవంచొద్దు అంటూ పోలీసులకు జగన్ విజ్ఞప్తి చేశారు. ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే వివరాలను డిజిటల్ డైరీలో నమోదు చేయాలని కార్యకర్తలకు జగన్ సూచించారు. ఏ పోలీసు అన్యాయం చేశాడు? ఏ అధికారి అన్యాయం చేశాడు? వాళ్లు చేసిన పని ఏంటి? అన్నది వెంటనే నమోదు చేయండి.. జరిగిన అన్యాయాన్ని మర్చిపోకముందే పూర్తి వివరాలతో డిజిటల్‌ డైరీలో ఎక్కించండి..
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డిజిటల్‌ డైరీని ఓపెన్‌ చేస్తాం.. ఎవరు ఏమేం అన్యాయం చేశారో లెక్కలు తీస్తాం.. చట్టం ఎలా పనిచేస్తుందో చూపిస్తాం అంటూ జగన్ పేర్కొన్నారు.

మెగా డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా పేరుతో పరీక్ష లేకుండానే టీచర్ ఉద్యోగాలు ఇస్తున్నారని జగన్ ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా ద్వారా ఇష్టానుసారంగా ఉద్యోగాలు కేటాయిస్తున్నారని విమర్శించారు. డీఎస్సీ వ్యవహారం అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

మనం చేసిన మంచి మనకు శ్రీరామరక్షగా ఉంటుంది. మనం ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లాలి. మన ఐదేళ్ల పాలనలో చేసిన మంచిని గట్టిగా ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు పాలనలో జరుగుతున్న అంశాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి.న విశాఖలో మేయర్ ను, కార్పొరేషన్ ను హైజాక్ చేసిన తీరును ప్రజలకు చెప్పాలని జగన్ సూచించారు. రాజకీయ వేధింపులు, అక్రమ కేసులు, పోలీసుల వ్యవహారాన్ని కూడా ప్రజలకు వివరించాలని చెప్పారు. విశాఖ తాగునీటి సమస్యను, విశాఖ భూముల దోపిడీ వ్యవహారాన్ని, గంజాయి, మద్యం సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి పార్టీ అగ్రనాయకత్వం వరకు కార్యకర్తలకు తోడుగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు.