భగవంతుడు చంద్రబాబును క్షమించడు, తిరుమల ప్రసాదంపై సీఎం వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం- వైసీపీ నేతలు

Tirumala Laddu Row : తిరుమల లడ్డూ ప్రసాదం గురించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సీఎం చంద్రబాబు దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం అని మండిపడ్డారు. రాజకీయ లబ్దికోసం చంద్రబాబు ఎంతవరకైనా దిగజారతారనే విషయం మరోసారి నిరూపితమైందన్నారు వైవీ సుబ్బారెడ్డి.

భూమన కరుణాకర్‌రెడ్డి- టీటీడీ మాజీ ఛైర్మన్‌
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు కామెంట్స్ పై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు చేసిన ఆరోపణలు అత్యంత దుర్మార్గం అన్నారు. రాజకీయ లబ్ధికోసం, రాజకీయ స్వార్థం కోసం భగవంతుడిని వాడుకుంటే.. అలాంటి ఆరోపణలు చేసిన వాడిని భగవంతుడు క్షమించడని హెచ్చరించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు.

”శ్రీ వేంకటేశ్వరస్వామి దుష్టశిక్షణ చేస్తాడని స్వయంగా చంద్రబాబే పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసిన వ్యక్తిని భగవంతుడు చూస్తూ ఊరుకోడు. రాజకీయ ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకుని భగవంతుడి పేరు మీద ఆరోపణలు చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. గతంలో వైయస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భాలున్నాయి. దీనికి అప్పుడు భగవంతుడు శిక్ష కూడా విధించాడు. అయినా చంద్రబాబు మారలేదు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఆరోపణలే చేస్తున్నారు.

వాస్తవం ఏంటంటే, తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాల మీదుగా ఈ పదార్థాలు తయారవుతాయి. ప్రసాదాల్లో పదార్థాల వినియోగం వారి చేతుల మీదుగా ఉంటుంది. అలాంటి వారి హస్తాల మీదుగా తయారయ్యే ప్రసాదాల మీద చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారంటే.. ఆయన బురద రాజకీయాలకు పరాకాష్ట. ఈ దఫా అధికారంలోకి వచ్చింది మొదలు తిరుమల వేదికగా చంద్రబాబు చేసిన విష ప్రచారాలు అన్నీఇన్నీ కావు. చివరకు ఏమీ దొరక్కపోవడంతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు” అని భూమన కరుణాకర్‌ రెడ్డి మండిపడ్డారు.

Also Read : జంతువుల కొవ్వుతో..! తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ నేతలు చేసిన విమర్శలకు టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ”ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పింది కూడా అదే సుబ్బారెడ్డి. మనిషి పుట్టుక పుట్టిన వాళ్ళు ఎవరూ ఇలాంటి పనులు చెయ్యరు. కానీ మీరు చేశారు అనేదే సీఎం ఆవేదన, బాధ. మీరు తిరుమల క్షేత్రాన్ని రాజకీయ లబ్ది కోసం ఎలా వాడుకున్నారో, భక్తుల మనోభావాలు ఎలా దెబ్బతీశారో, కలియుగ వైకుంఠాన్ని ఎంత అపవిత్రం చేశారో ఏ ఒక్క హిందూ భక్తుడు మరిచిపోలేదు, మరిచిపోరు కూడా! మీరు చేసిన పాపాలకు శిక్షే నిన్నటి ప్రజాగ్రహం. ఆ దేవుని సన్నిధికి వచ్చే నైతిక అర్హత కూడా మీరు కోల్పోయారు అనేది ముందు తెలుసుకోండి” అంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి సోమిరెడ్డి.

Also Read : వైసీపీని వీడుతున్న బొత్స ముఖ్య అనుచరులు.. ఎదురుదెబ్బేనా? లేక వ్యూహమా?

కాగా, వైసీపీ పాలకులు తిరుమల పవిత్రను దెబ్బతీశారని, లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారని తెలిసిందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.