జంతువుల కొవ్వుతో..! తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
తామిప్పుడు స్వచ్చమైన నెయ్యిని వాడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

Tirumala Laddu Prasadam : తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని గత పాలకులు అపవిత్రం చేశారని చంద్రబాబు ఆరోపించారు. తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపించారు. తామిప్పుడు స్వచ్చమైన నెయ్యిని వాడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
Also Read : మందుబాబులకు గుడ్‌న్యూస్..! ఏపీ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు..
”గత పాలకులు చివరికి వేంకటేశ్వర స్వామి పవిత్రతను కూడా దెబ్బతీశారు. అక్కడ ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించారు. లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారు. నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని తెలిసింది. మేమిప్పుడు స్వచ్చమైన నెయ్యిని వాడుతున్నాం” అని సీఎం చంద్రబాబు అన్నారు.
గత ప్రభుత్వం హయాంలో తిరుమల కొండపై అనేక అపచారాలు జరిగాయని టీడీపీ నేతలు ముందు నుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైఎస్ జగన్ వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా తిరుమల లడ్డూ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపై భక్తుల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. తనకున్న సమాచారం మేరకే సీఎం చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తోంది. చంద్రబాబు సర్కార్ రాగానే టీటీడీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ వేశారు. శ్రీవారి ట్రస్టులో జరిగిన అవకతవకలు, కొండ మీద జరుగుతున్న అపవిత్రమైన కార్యక్రమాలతో పాటు అనేక అంశాలపై అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు.
ఆ విచారణలో తెలిసిన అంశాలనే ఇప్పుడు సీఎం చంద్రబాబు బయటకు చెప్పినట్లు చెబుతున్నారు. ఇంకా చాలా అంశాలపై మాట్లాడాల్సి ఉందని, అయితే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి తాను సంయమనం పాటిస్తున్నానని సీఎం చంద్రబాబు అంటున్నారు. కొన్ని అంశాలు మాత్రం బయట పెట్టక తప్పని పరిస్థితి ఉందని టీడీపీ నేతలు అంటున్నారు.
మొదటి నుంచి చంద్రబాబు శ్రీవారికి భక్తుడిగా ఉన్నారు. శ్రీవారి ఆలయంలో పవిత్రత దెబ్బతినకుండా ఉండేందుకు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా పాటు పడుతున్నారు.