వైసీపీని వీడుతున్న బొత్స ముఖ్య అనుచరులు.. ఎదురుదెబ్బేనా? లేక వ్యూహమా?
బొత్స అనుచరులు పార్టీని వీడుతున్నారంటే ఇందులో ఇంకేదో మర్మముందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.

Gossip Garage : వైసీపీ సీనియర్ నేత, మండలిలో ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణకు సొంత జిల్లాలో షాక్ మీద షాక్ తగులుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బొత్సతో సహా ఆయన కుటుంబ సభ్యులు అందరినీ ప్రజలు ఓడిస్తే… ఇప్పుడు ఆయనకు ముఖ్య అనుచరులుగా భావిస్తున్న నేతలు సైతం రాం.. రాం.. చెప్పేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. బొత్స కుటుంబంలోనే రెండు వర్గాలు.. అధికారంలో ఉండగా క్యాడర్‌ను పట్టించుకోలేదనే అసంతృప్తితో రగిలిపోతున్న ద్వితీయ శ్రేణి నేతలు బొత్సకు ఎదురు తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో విజయనగరం జిల్లా రాజకీయాల్లో మళ్లీ నిలదొక్కుకోవడం బొత్సకు సవాలేనంటున్నారు…
జనసేనలో చేరిన బొత్స సమకాలీకుడు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచానన్న సంతోషం సీనియర్ నేత బొత్సకు ఎన్నాళ్లూ లేకుండా చేస్తున్నారు ఆయన అనుచరులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా నెల్లిమర్ల నియోజవర్గానికి చెందిన బొత్స అనుచర గణం సుమారు 4 వేల మంది ఒకేసారి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో జిల్లా రాజకీయాల్లో బొత్స సమకాలీకుడు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనుమల్లు వెంకటరమణతోపాటు మరికొందరు కీలక నేతలు ఉన్నారు.
చనుమల్లు, బొత్స ఇద్దరూ మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకున్నా, బొత్స వేగంగా రాష్ట్ర రాజకీయాల్లోకి ఎదిగారు. ఆయనకు వెన్నుదన్నుగా చనుమల్లు నిలిచారు. ఇక 2009లో బొత్స కారణంగా ఎమ్మెల్యే టికెట్ వదులుకున్న చనుమల్లు వెంకటరమణ… ఇప్పటివరకు బొత్సతోనే కలిసి నడిచారు. దాదాపు మూడు దశాబ్దాలుగా బొత్సనే నమ్ముకున్నా, తనకు అన్యాయం జరుగుతోందనే ఆవేదనతో తాజాగా పార్టీని వీడారు చనుమల్లు. ఇది బొత్సకు షాక్‌గానే చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు.
న్యాయం చేస్తానని తిప్పుకున్నారు..
విజయనగరం జిల్లా రాజకీయాలను శాసించిన బొత్స… చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతినగరం నియోజకవర్గాల నుంచి బొత్స కుటుంబ సభ్యులు పోటీ పడేవారు. చీపురుపల్లిలో బొత్స.. గజపతినగరంలో బొత్స సోదరుడు అప్పలనర్సయ్య, నెల్లిమర్లలో వరసకు సోదరుడయ్యే బడ్డకొండ అప్పలనాయుడు ఎమ్మెల్యేలుగా గతంలో పనిచేశారు. ఈ ఎన్నికల్లో ముగ్గురూ ఓడిపోయారు. అయితే నెల్లిమర్లలో బొత్సకు.. ఆయన సమీప బంధువైన మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పనాయుడికి కాస్త గ్యాప్ ఉందనే ప్రచారం ఉంది.
మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ, బొత్స మేనల్లుడు విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వియ్యంకులు… బావా బామ్మర్దులు. ఐతే ఈ ఇద్దరికీ బొత్సతో విభేదాలు ఉన్నట్లు చాలాకాలంగా ప్రచారం ఉంది. తాజాగా పార్టీని వీడిన చనుమల్లు వెంకటరమణ బొత్స వర్గంగా ముద్రపడ్డారు. 2009లో చనుమల్లును కాదని బడ్డుకొండకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన బొత్స.. అప్పటి నుంచి చనుమల్లుకు న్యాయం చేస్తానని చెప్పి తిప్పుకున్నారే కానీ, ఏ పదవీ ఇవ్వలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
తగిన సమయంలో షాక్ ఇచ్చిన అనుచరులు..
ఇలా నెల్లిమర్ల నియోజకవర్గంలో కీలక నేతను వదులుకున్న బొత్స… ఆ నియోజకవర్గంలో పట్టుకోల్పోయినట్లేనని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పనాయుడు నెల్లిమర్లలో వేరు కుంపటి పెట్టగా, బొత్స అనుచరులుగా చెప్పుకున్న వారు సైతం జనసేనలో చేరడం వల్ల రాజకీయంగా బొత్సకు మైనస్సేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు బంధువుల కోసం అనుచరులను నిర్లక్ష్యం చేసిన బొత్సకు… తగిన సమయంలో అనుచరులు షాక్ ఇచ్చినట్లు చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా, తన కుటుంబ సభ్యుల పదవుల కోసం బొత్స పనిచేశారని, తమను మాత్రం పట్టించుకోలేదని తాజాగా పార్టీని వీడిన నేతలు విమర్శలు చేస్తున్నారు. పార్టీ ఓడినా బొత్స వైఖరిలో మార్పు రాకపోవడంతో ఆయనకు చెప్పే జనసేనలో చేరిపోయామని అంటున్నారు.
పార్టీ వీడటం వెనుక మర్మముందా?
తాజా పరిణామాలతో విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స హవాకు బ్రేకులు పడుతున్నట్లేనా? అన్న టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో బొత్స అనుచరులు పార్టీని వీడుతున్నారంటే ఇందులో ఇంకేదో మర్మముందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పార్టీని వీడి వైసీపీలో చేరినా, బొత్సతోపాటు ఆయన ముఖ్య అనుచరులు కాంగ్రెస్‌లోనే కొనసాగారు. 2014 ఎన్నికల అనంతరం టీడీపీకి ప్రత్యామ్నాయంగా వైసీపీ ఎదగడంతో ఆ పార్టీలో చేరారు. ఆ సమయంలో ముందుగా తన అనుచరులను వైసీపీలోకి పంపి… తర్వాత తాను పార్టీలోకి వచ్చారు బొత్స.
Also Read : వైసీపీకి బిగ్ షాక్.. జనసేనలోకి బాలినేని శ్రీనివాస రెడ్డి?
అందుకే జనసేనలోకి వెళ్తున్నారా?
ఇప్పుడు కూడా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఓటమిని మూటగట్టుకోవడంతో ఆ నాటి సంఘటనలను గుర్తుచేస్తున్నారు పరిశీలకులు. వైసీపీ, టీడీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన ఉండటంతో బొత్స అనుచరులు అటు మొగ్గు చూపుతున్నారని… ఇది భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సూచన అంటున్నారు. మొత్తానికి ప్రస్తుతానికి రాజకీయంగా బొత్సకు ఎదురుదెబ్బగా చెబుతున్నా… బొత్స అనుచరులు వలసలు మున్ముందు భారీ మార్పులను సూచిస్తున్నాయంటున్నారు.