ఎంపీ దుర్గాప్రసాద్‌కు వచ్చిన ఆ పెద్ద కష్టమేంటి?

  • Publish Date - July 17, 2020 / 06:30 PM IST

బల్లి దుర్గాప్రసాద్… నెల్లూరు జిల్లా గూడూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారాయన. ప్రస్తుతం వైసీపీ తరఫున తిరుపతి ఎంపీగా ఉన్నారు. కాకపోతే అధికార పార్టీలో ఉన్నా ఆయనకు పెద్ద కష్టమే వచ్చిందట. ఇటు పార్టీ కేడర్, అటు అధికారులు ఆయనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు సైతం ఆయనను పట్టించుకోవడం లేదంటున్నారు. ఈ విషయంపై ఎంపీ దుర్గాప్రసాద్ కొన్ని కార్యక్రమాల్లో బాహాటంగానే అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఇద్దరి మధ్య పొసగడం లేదట :
నిజానికి తిరుపతి పార్లమెంట్ స్థానం సగం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉంది. చిత్తూరు జిల్లాలో మూడు, నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ ఆఖరి నిమిషంలో తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీకి దిగారు. చిత్తూరు జిల్లా దుర్గాప్రసాద్‌కు పూర్తిగా కొత్త. ఇక్కడి వైసీపీ నేతలతో ఆయనకు అంతగా పరిచయాలు కూడా లేవు. అయినా కూడా అన్నీ కలసిరావడంతో ఎంపీగా గెలిచారు. అప్పటి వరకూ బాగానే ఉంది. నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీలో నివాసం ఉంటున్న దుర్గాప్రసాద్‌కు, స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్‌కు మధ్య పొసగడం లేదు.

కేడర్‌కు ఆయనకు మధ్య గ్యాప్ :
నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, సర్వేపల్లి ఎమ్మెల్యేలు కూడా ఎంపీని కలుపుకొని పోవడం లేదనే ప్రచారం ఉంది. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో రాజకీయ స్నేహం ఉండటంతో పరిస్థితి కాస్త పర్వాలేదనుకున్నా, సర్వేపల్లి నియోజకవర్గంలో అంత ప్రాధాన్యం ఉండటం లేదంట. ఇక సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యతో బంధుత్వం ఉండడంతో అక్కడ పరిస్థితి పర్వాలేదు.

నెల్లూరు జిల్లాలో ఎలాగోలా నెట్టుకొస్తున్నా… చిత్తూరు జిల్లా నుంచే ఆయనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయట. జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేల పట్ల ఎంపీ దుర్గాప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారట. ఎన్నికై ఏడాది గడిచినా గూడూరులోనే ఉండటం, స్థానికంగా ఉండడం లేదన్న ప్రచారం జనంలో బాగా ఉంది. దీంతో కేడర్‌కు ఆయనకు మధ్య గ్యాప్ పెరిగింది.

చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం ప్రొటోకాల్ పాటించడం లేదని, ఈ కారణంగానే అధికారిక కార్యక్రమాల్లో, పార్టీ కార్యక్రమాల్లో ఎంపీ దుర్గాప్రసాద్‌ చురుగ్గా పాల్గొనలేక పోతున్నారని అంటున్నారు. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌లతో ఆయనకు సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయట. ఇక సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంతోనూ పెద్దగా పరిచయం లేదు.

అప్పుడప్పుడు సమీక్షల్లో కలుసుకోవడం తప్ప జిల్లా మంత్రులతోనూ ఆయనకు అంత సఖ్యత లేదని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో ఎంపీ దుర్గాప్రసాద్ పార్టీ కేడర్‌కు చేరువ కాలేకపోతున్నారట. తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన లోలోన మధనపడుతున్నారని అంటున్నారు. మరి భవిష్యత్‌లో అయినా ఈ పరిస్థితి నుంచి బయటపడతారో లేదో?