Botcha Satyanarayana: లైవ్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. వైఎస్ఆర్‌ను తలుచుకుని తీవ్ర భావోద్వేగం

మావిగన్ అన్నా.. ఆ ప్రాంతం అన్నా.. మా నాయకుడు ఆలోచన అన్నా.. మీకెందుకు ఉలికిపాటు అని ప్రశ్నించారు.

  • Published On : April 9, 2026 / 06:37 PM IST

 

Botcha Satyanarayana: వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఎమోషనల్ అయ్యారు. లైవ్ లో వెక్కి వెక్కి ఏడ్చారు. వైఎస్ఆర్ ను తలుచుకుని ఆయన కన్నీటిపర్యంతం అయ్యారు. ప్రెస్ మీట్ లో వైఎస్ఆర్ మరణం గురించి ప్రసావిస్తున్న సమయంలో బొత్స తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బోరున విలపించారు.

మావిగన్ గురించి జగన్ మాట్లాడిన క్షణం నుంచి కూటమికి, చంద్రబాబుకి నిద్రలో కూడా అదే గుర్తుకు వస్తుందని బొత్స అన్నారు. మంత్రులు ఇష్టారాజ్యంగా, అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మావిగన్ అన్నా.. ఆ ప్రాంతం అన్నా.. మా నాయకుడు ఆలోచన అన్నా.. మీకెందుకు ఉలికిపాటు అని ప్రశ్నించారు. వైఎస్సార్ వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్టకట్టిందన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం గురించి బొత్సనే నాకు చెప్పారని ప్రచారం చేస్తారా అంటూ మంత్రి అచ్చెన్నాయుడిపై విరుచుకుపడ్డారు. ఇచ్చిన ఉద్యోగానికి న్యాయం చేయలేక అసత్య ప్రచారాలు చేస్తారా అని నిలదీశారు. మంత్రి అచ్చెన్నాయుడు లాంటి మనస్తత్వం, రాజకీయ అవసరాల కోసం చేసిన పనులు మర్చిపోయారా అని ప్రశ్నించారు. పార్టీ లేదు బొక్కా లేదన్న మాటలు మర్చిపోయారా అని మంత్రి అచ్చెన్నపై విరుచుకుపడ్డారు.

‘రాజకీయాల్లో అందరూ నీలాగే ఉంటారని అనుకుంటున్నావా? ప్రజా నేతగా గుర్తింపు పొందిన వాళ్ళను వేళ్ళ మీద లెక్కబెడితే ఒకటి రెండో స్థానంలో వైఎస్సార్ ఒకరు. అచ్చెన్నాయుడు సహనం కోల్పోయి ఉనికి చాటుకునేందుకు అహంభావంతో మాట్లాడుతున్నారు. మీ వ్యాఖ్యలు ఖండించడానికి నేను ప్రెస్ మీట్ కు రాలేదు. తుచ్ఛమైన రాజకీయాలు, పదవుల కోసం నీచ రాజకీయాలకు దిగకండి. దమ్ముంటే రాజకీయాలు చేయి. గౌరవం ఇచ్చి పుచ్చుకుంటే మంచిది.

వైఎస్సార్ మరణం గురించి దిగజారుడు మాటలు మాట్లాడినందుకే నా ఆవేదన. అచ్చెన్నాయుడు ఆలోచనలు మోకాలు నుంచి దిగజారి అరికాలులోకి వచ్చాయి. దిగజారుడు మాటలు, వ్యాఖ్యలు మానుకుంటే మంచిది. తెల్లవారి ఐదో గంటకు వైఎస్సార్ మృతదేహాన్ని గుర్తించి పావురాల గుట్ట నుంచి కర్నూలు తరలించాం. జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే రాజశేఖర్ రెడ్డి మరణాన్ని వాడుకోవడం సమంజసం కాదు. ఈ తరహా రాజకీయాలను రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు. NTR మరణానికి చంద్రబాబు కారణం అంటే మానసికంగా దెబ్బ తీశారని అర్ధం కానీ కత్తితో పొడిచారని కాదు కదా.

రాజకీయాల కోసం తప్పుడు ఉపమానాలు మానండి. మావిగన్ వల్ల వైసీపీ బద్నాం అవుతుందనుకుంటే మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు? మావిగన్ మీద చర్చను పక్కదారి పట్టించడానికి చౌకబారు వ్యాఖ్యలు, రాతలు రాయిస్తున్నారు. నేను మాట్లాడాలంటే ఎన్నో మాట్లాడగలను. ఇవన్నీ అప్రస్తుతం. అచ్చెన్నాయుడికి బుర్రలో ఆలోచన ఉంటే క్షమాపణ కోరాలా వద్దా? అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. మార్పు చేర్పుల్లో పదవి కాపాడుకునే పనిలో పడ్డారు. నాతో పాటు కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరా రెడ్డి అందరూ ఉన్నారు.

జగన్ ని సీఎం చేయాలని ప్రతిపాదించారు. మొదటి సారి డిస్కషన్ జరిగినప్పుడు తొందరపడటం ఎందుకని నేనే అన్నా. మీ పార్టీ నేతల చరిత్రలన్నీ మా దగ్గర ఉన్నాయి. అమరావతి కాదు కమ్మరావతి అన్న రేణుకా చౌదరి మాటలు ఖాయం చేసుకుని అదే కొనసాగించండి. కానీ రాజకీయాలను నీతిగా చేయండి. మీరు జగన్ ను రాజకీయంగా ఎదుర్కొండి. కానీ మరణించిన మహా నాయకుడు గురించి తప్పుడు మాటలు మాట్లాడతారా? చంద్రబాబు ఇదేనా మీ సంస్కృతి” అంటూ నిప్పులు చెరిగారు బొత్స సత్యనారాయణ.

Also Read: వైఎస్ఆర్ మరణం వెనుక..- జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు