Adhika Masam Daan: అధిక మాసం.. తప్పనిసరిగా చేయాల్సిన దానాలు ఇవే..
అమ్మవారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందేందుకు అధిక మాసంలో 33 అరిసెలు దానం విశేషంగా సహకరిస్తుంది.
- Naveen
- Updated on- May 18, 2026 / 12:36 AM IST
Adhika Masam Daan: మే 17వ తేదీ ఆదివారం నుంచి అధిక జేష్ఠ మాసం ప్రారంభమైంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి అధిక మాసం అనే పేరుతో ప్రత్యేకమైన మాసం వస్తుంది. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అనే పేరుతో పిలుస్తారు. ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. అధిక మాసం అంటే దానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న మాసం.
పిల్లలు జీవితంలో వృద్ధిలోకి రావాలంటే అధిక మాసంలో గుమ్మడి కాయ, పనస పండు ఈ రెండింటిని కలిపి పంతులికి లేదా ముత్తైదువకు గానీ దానం ఇవ్వాలి. అలాగే స్వయం పాకం దానం ఇస్తే కుటుంబ కలహాలు తొలగిపోతాయి. అధిక మాసంలో ఇవ్వాల్సిన మరో గొప్ప దానం అరిసెల దానం. అధిక మాసంలో 33 అరిసెలు దానం ఇవ్వాలని శాస్త్రంలో చెప్పారు. అమ్మవారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందేందుకు అధిక మాసంలో 33 అరిసెలు దానం విశేషంగా సహకరిస్తుంది. 33 అరిసెలు పంతులుకి లేదా ముత్తైదువకి కానీ దానం ఇస్తే ఏడాది పాటు అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది.
అలాగే అధిక మాసంలో పాలు కానీ బెల్లం కానీ దానం ఇస్తే జాతక దోషాల తీవ్రత నుంచి సులభంగా బయటపడొచ్చు. నవ గ్రహాల అనుకూలత కలుగుతుంది. ఎవరికైనా అధిక మాసంలో పుట్టిన రోజు వస్తే శివాలయంలో అభిషేకం చేయించుకుని బెల్లంతో చేసిన పాయసం లేదా బెల్లంతో చేసిన ఏదైనా పదార్దాలు శివాలయంలో దానం ఇచ్చినట్లైతే నిండు నూరేళ్లు ఆయుష్షు పెరుగుతుంది. అంతటి శక్తి అధిక మాసానికి ఉంది. అలాగే అధిక మాసంలో ఎవరైనా శరీరాన్ని విడిచి పెట్టినట్లైతే వాళ్లకి అధిక మాసంలోనూ పితృ కార్యాలు చేయాలి, నిజ మాసంలోనూ పితృకార్యాలు చేయాలి.
అధిక మాసంలో దానం అనేది అత్యంత ముఖ్యమైన ఆచరణలలో ఒకటి. ఆహార దానం, నీటి దానం, వస్త్ర దానం, గోవులకు మేత పెట్టడం, జంతువులకు ఆహారం పెట్టడం, పేదలకు సాయం చేయడం అత్యంత శుభప్రదమైనవి. దానం ఉద్దేశ్యం కేవలం పుణ్యం సంపాదించడమే కాదు అహంకారాన్ని తగ్గించి కరుణను పెంచుకోవడం కూడా.
