Maha Shivratri Representative Image (Image Credit To Original Source)
Maha Shivratri: మహా శివరాత్రికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, పూజ ఎలా చేసుకోవాలి, ఏ సమయంలో పూజ చేయాలి, శివరాత్రి రోజున పాటించాల్సిన నియమాలు ఏంటి? శివరాత్రి రోజున ఏం చేస్తే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాం. శివరాత్రి రోజు అర్థరాత్రి సమయంలో పరమేశ్వరుడు ఒక అగ్నిలింగం లాగా బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఇద్దరి మధ్యలో ఆవిర్భవిస్తాడు. ఇందులో ఉన్న అర్థం ఏంటంటే.. శివరాత్రి అర్థరాత్రి సమయంలో అంటే చీకటిగా ఉన్న సమయంలో పరమేశ్వరుడు అగ్నిలింగం లాగా అంటే ఒక వెలుతురు ఉన్న లింగంలాగా ఆవిర్భవించాడు. శరీరం చీకటి, లోపల ఉన్న ఆత్మ వెలుగు. కాబట్టి శివరాత్రి రోజు శివుడు లింగ రూపంలో అవతరించడంలో ఉన్న అద్భుతమైన సందేశం ఏంటంటే.. శరీరం అనే చీకటిలో ఆత్మ అనే వెలుతురిని అందరూ దర్శించండి అని పండితులు చెబుతున్నారు.
ఆత్మే సాక్ష్యాత్తు భగవత్ స్వరూపం అన్న సత్యాన్ని తెలుసుకోమని శివుడు మనందరికి సందేశం ఇస్తున్నాడు. అందుకే మహా శివరాత్రి అంటేనే అందరూ ఇంట్లో దీపం పెట్టాక జ్వాలాయ నమ: జ్వలలింగాయ నమ: ఆత్మాయ నమ: ఆత్మలింగాయ నమ: పరమాయ నమ: పరమలింగాయ నమ: ఈ మూడు మంత్రాలు తప్పకుండా చదువుకోవాలి. ఇవి చదువుకుంటే శివానుగ్రహం వల్ల ఆత్మ సాక్షాత్కారంవైపు అడుగులు వేయవచ్చు. శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు.
* సూర్యోదయానికి ముందే లేచి తల స్నానం చేయాలి
* కోపం తెచ్చుకోకూడదు, శాంతంగా ఉండాలి
* శివరాత్రి రోజు ఎవరితో మాట్లాడినా శివ శివ అని పిలవాలి
* గురువును పూజించాలి, గురువు పాదాలకు నమస్కారం చేయాలి
* తప్పకుండా భస్మదారణ చేయాలి (పురుషుడు-తడి విభూదిని ధరించాలి, స్త్రీలు-పొడి విభూదిని ధరించాలి)
* శివరాత్రి రోజు అందరూ కూడా నుదిటి భాగం, వక్ష స్థలం దగ్గర, భుజాలకు, నాభి ప్రాంతంలో విభూది ధారణ చేయాలి.
* తెలుపు రంగు వస్త్రాలే ధరించాలి
* పార్ధివ లింగం పూజ చాలా గొప్పది (పార్ధివ లింగం-మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తే చాలా మంచిది)
* మట్టిలో కొద్దిగా ఆవుపేడ కలిపి చేసిన శివలింగం అయితే ఇంకా మంచిది
* పూజ అయిపోయాక మర్నాడు నదిలో నిమజ్జనం చేయాలి లేదా మొక్కల్లో వదలాలి
* మట్టి లింగంతో చేసిన శివ లింగానికి పూజ చేయలేని వాళ్లు ఏ శివ లింగానికైనా పూజ చేయొచ్చు.
* శివరాత్రి రోజు మారేడుకి చాలా శక్తి ఉంటుంది. మారేడు దగ్గర ఆవు పాలతో తయారు చేసిన పాయసాన్ని ఎవరైనా శివ భక్తుడికి ఇవ్వాలి.
* మారేడు దగ్గర ఆవు నెయ్యి దీపం పెడితే శరీరాన్ని విడిచాక కైలాసం సిద్ధిస్తుందని నమ్మకం.
శివరాత్రి అంటేనే సాయంకాలం 6 గంటలకు ప్రారంభమై మర్నాడు సూర్యోదయం 6 గంటల వరకు ఉండే సమయం. చాలా పవర్ ఫుల్. ఫిబ్రవరి 15 ఆదివారం సాయంత్రం నుంచి ఫిబ్రవరి 16 ఉదయం 6 గంటల మధ్యలో చేసే శివపూజకు చాలా ఎక్తి ఉంటుంది. అన్నింటికంటే గొప్ప సమయం అర్థరాత్రి 12 గంటలకు లింగ్దోభవ సమయం. అర్థరాత్రి 12 గంటల నంచి 12 గంటల 40 నిమిషాల మధ్య ప్రాంతంలో శివుడికి అభిషేకం లేదా పూజ చేసుకోండి. శివాయ గురవే నమ: అని అనుకుంటూ పూజ చేసుకోవాలి. ఇలా చేసే శివానుగ్రహానికి పాత్రులు అవుతారు అని పండితులు చెబుతున్నారు.
NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.