×
Ad

నాగదేవతా కుండలినీ శక్తి: మీకు పెళ్లి కావడం లేదా? సంతానం లేదా? పుట్టిన పిల్లలు చనిపోతున్నారా? ఇలా చేయండి..

ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు...

Kaal Sarp Dosh: నాగదేవతా కుండలినీ శక్తి

మన పురాణములలో నాగజాతికి విశిష్ఠమైన ప్రాధాన్యం ఉంది. మనము నాగరాజును భక్తిశ్రద్ధలతో కొలుస్తాము. సృష్ట్యాదిలోనే నాగజాతి ఆవిర్భవించింది.

దక్షప్రజాపతి తన 13 మంది కుమార్తెలు అదితి, దితి, దనువు, కాల, అనాయువు, సింహక, ముని, కపిల, వినత, కద్రువ, క్రోధ, పాధ, క్రూరలను కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహము చేశారు. కశ్యప ప్రజాపతి భార్య ధ్రువ ఒకరోజున భర్తను ఒక కోరిక కోరింది. అగ్ని వంటి తేజస్సు, ధీరుడు, పొడవైన శరీరం గల్గిన వెయ్యిమంది పుత్రులు ఇమ్మని భర్తను కోరింది.

కశ్యపమహర్షి చాలా సంవత్సరములు తపస్సునొనర్చి, పుత్రకామేష్ఠి యాగము చేశారు. ఆ యాగఫలితముగా ధ్రువకు వెయ్యి సర్పాలు జన్మించాయి. అవే వాసుకి, తక్షక, కర్కోటక, తక్షక, పద్మ, మహాపద్మ, కుళిక, శంఖపాల, శంఖనంద, విషక్త, ఆదిశేష, అనంత మొదలగు సర్పాలు. వినతకు, అనూరుడు, గరుత్మంతుడు జన్మించారు.

గరుత్మంతుని ఆభరణాల్లో కంకణంగా ఆదిశేషుడు, యజ్ఞోపవీతంగా వాసుకి మొలనూలుగా దక్షుడు మాలికగా కర్కోటకుడు, కుడిచెవి కుండలంగా పద్ముడు ఎడమచెవి కుండలంగా మహాపద్ముడు కేశాలంకారంగా శంఖపాలుడు, కుడి భుజానికి కుళికుడు, అలంకారాలుగా అష్ట నాగాభరణాలతో ఉంటాడు. సూర్యుని రథానికి పగ్గం సర్పము, శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై పవళిస్తాడు. ఈశ్వరుడు నాగాభరణుడు గణపతి యజ్ఞోపవీతము నాగరాజు.

నాడులతో నిండి ఉన్న మానవుని వెన్నెముకను వెన్నుపాము అంటారు. అందులో కుండలినీ శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలో ఉంటుంది. అది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల విషరూపంలో ఉండి మనిషిలోని సత్వగుణాన్ని హరిస్తూ ఉంటుంది. నాగదేవతను ఆరాధించడం వల్ల మానవునిలోని విషము హరింపబడుతుంది.

బ్రహ్మ పురాణము ప్రకారము చంద్రవంశపు రాజు శూరిసేనుడు భార్యతో కలిసి సంతానము కోసము చాలా రోజులు తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలము వలన వారికి సర్పము జన్మించినది. అది సర్పమైన మాట్లాడేది. తనకు ఉపనయనము, వివాహము చెయ్యమని తండ్రిని కోరింది. సర్పమునకు ఉపనయనము చేసి వంశాచారము ప్రకారము ఒక ఖడ్గాన్ని పంపి రాకుమార్తెతో పెళ్లి జరిపించారు.

ఆ అమ్మాయి అత్తవారింటికి వచ్చాక తన భర్త పాము అని తెలుసుకొంది. అయినా భయపడలేదు. సర్పరూపంలో ఉన్న భర్తతో స్నేహం చేసింది. భర్త ఎలాంటివాడైనా స్త్రీకి దైవసమానుడు అని భావించి శివుని శాపము వల్ల తాను సర్పరూపములో ఉన్నాను అని చెప్పి భార్యతో కలిసి గౌతమీ నదిలో స్నానము చేసి సర్పవిమోచనము పొంది మానవరూపము ధరించాడు.

సర్పముల పూజ.. లాభాలు.. 

రాహు, కేతువుల దోషాలు ఉన్నవారు, సర్పదోషము, కాలసర్పదోషము ఉన్నవారు, కుజదోషము ఉన్నవారు వివాహం కాని వారు, సంతానం కలగనివారు, సంసార బాధలలో ఉన్నవారు, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు సర్పములను పూజించాలి. సంతానము కలగకపోయినా, పుట్టిన పిల్లలు చనిపోతున్నా నాగప్రతిష్ఠ చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని భవిష్య పురాణములో చెప్పారు.


— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ

Contact: 9849280956, 9515900956