×
Ad

Sankatahara Chaturthi 2026: నేడే సంకష్టహర చతుర్థి.. పూజ ఇలా చేస్తే అఖండ రాజయోగం మీ సొంతం..!

బంగారు, వెండి, రాగి, పగడ, ముత్య, మరకత.. ఏ గణపతినైనా ఉంచుకోవచ్చు. శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతినైనా ఉంచుకోవచ్చు.

  • Published On : February 5, 2026 / 06:00 AM IST

Sankatahara Chaturthi Representative Image (Image Credit To Original Source)

  • సంకష్టహర చతుర్ధి వ్రతం చేసుకుంటే జాతకంలో ఉన్న కుజదోషాలు తగ్గిపోతాయి
  • జీవితంలో పూర్ణ ఆయుర్దాయం పొందుతారు
  • జీవితంలో పూర్వ వైభవం రావాలన్నా ఈ వ్రతం చేసుకోవాలి
  • దూరమైపోయిన భార్య, భర్తలు కలవాలన్నా సంకష్టహర చతుర్ధి వ్రతం చేయాలి

Sankatahara Chaturthi 2026: ఫిబ్రవరి 5.. గురువారం.. సంకష్టహర చతుర్ధి.. ఎలాంటి నియమాలు పాటిస్తూ సంకష్టహర చతుర్ధి వ్రతం చేసుకుంటే గణపతి అనుగ్రహం తొందరగా కలుగుతుందో, చతురావృతి తర్పణాన్ని గణపతికి ఎలా సమర్పించాలో, సంకష్టహర చతుర్ధి సందర్భంగా ఎలాంటి విధివిధానాలు పాటిస్తే గణపతి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి అద్భుత విజయాలు పొందవచ్చో తెలుసుకుందాం.

ప్రతి నెలలో బహుళ పక్షంలో వచ్చే చతుర్ధి తిథిని సంకష్టహర చతుర్ధిగా జరుపుకోవడం గణపతిని పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అసలు సంకష్టహర చతుర్ధి రోజున గణపతిని ఎందుకు పూజించాలి? తెలుసుకుందాం. నవగ్రహాలలో కుజుడు కూడా సంకష్టహర చతుర్ధి వ్రతం చేశాడని, అందుకే ఈ వ్రతం చేసుకుంటే జాతకంలో ఉన్న కుజదోషాలు తగ్గిపోతాయని పండితులు చెబుతున్నారు. కుజుడి అనుగ్రహం కలుగుతుందన్నారు. నరకలోకానికి అధిపతి అయిన యమ ధర్మరాజు కూడా సంకష్టహర చతుర్ధి వ్రతం చేశాడన్నారు. అంటే జీవితంలో అపమృత్యు దోషాలు లేకుండా పూర్ణ ఆయుర్దాయం ఉండాలంటే సంకష్టహర చతుర్థి వ్రతం చేయాలని పండితులు పేర్కొన్నారు.

బ్రహ్మాండమైన పరాక్రమము, బలము ఉన్న సంతానం కలగాలంటే సంకష్టహర చతుర్ధి రోజున గణపతిని పూజించాలి. జీవితంలో పూర్వ వైభవం రావాలన్నా ఈ వ్రతం చేసుకోవాలి. దూరమైపోయిన భార్య, భర్తలు కలిసిపోవాలన్నా కూడా సంకష్టహర చతుర్ధి వ్రతం చేయాలి. సంకష్ట హర చతుర్థికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. సంకష్టహర చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని చేయాలనుకున్న వాళ్లు గణేశ పురాణంలో చెప్పిన విధంగా చేస్తే మామూలు పూజకంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. గణేశ పురాణంలో సంకష్టహర చతుర్థి ఎలా చేసుకోవాలని చెప్పారో తెలుసుకుందాం.

సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి..

సంకష్టహర చతుర్ధి అంటేనే సాయంకాలం పూట గణపతి పూజ చేయటం. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని సాయంకాలం చేసుకోవాలి. సాయంకాలం కాగానే నువ్వుల పొడి, ఉసిరిక పొడి.. శరీరానికి రాసుకుని స్నానం చేయాలి. దీంతో వ్రతం ప్రారంభమవుతుంది. సంకష్టహర చతుర్ధి వ్రతం చేయాలి అనుకోగానే మొట్టమొదటగా సాయంత్రం అవ్వగానే తెల్ల నువ్వుల పిండి, ఉసిరిక పొడి.. ఈ రెండింటినీ శరీరానికి రాసుకుని స్నానం చేయాలి.

స్నానం చేశాక పూజ గదిలో గణపతి విగ్రహం ఉంచుకోవాలి. బంగారు, వెండి, రాగి, పగడ, ముత్య, మరకత.. ఏ గణపతినైనా ఉంచుకోవచ్చు. శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతినైనా ఉంచుకోవచ్చు. ఏ లోహంతో చేసిన గణపతి విగ్రహమైనా పూజలో ఉంచుకోవచ్చు. ఒక్క ఇనుము లోహం మాత్రం వాడొద్దని గణేశ పురాణంలో చెప్పారు. ఇనుముతో చేసిన గణపతి తప్ప ఏ గణపతినైనా పూజకు వాడొచ్చు.

గణపతిని పూజించాలి అనుకున్న వాళ్లు వెంటనే ఫలితాలు రావాలంటే.. ఆవు పేడ కొద్దిగా మట్టిలో కలిపి ఆ మట్టితో చేసిన గణపతిని కానీ తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని కానీ పూజించండి. ఎప్పుడైనా సరే గణపతిని సంకష్టహర చతుర్థి రోజున పూజించాలి అనుకున్నప్పుడు పూజలు ఆవు పేడ కచ్చితంగా ఉండాలి. గణేశ పురాణం ప్రకారం సంకష్టహర చతుర్ది రోజున పూజ చేసుకునే పీట మీద తమలపాకు ఉంచి దాని మీద ఆవు పేడ ఉంచి దాని మీద కొన్ని గరిక పోచలు వేసి అక్కడ గణపతి విగ్రహం పెట్టుకుని పూజ చేస్తేనే సంపూర్ణ ఫలితం కలుగుతుంది.

పూజ పూర్తయ్యాక ఆ ఆవు పేడను ఎరువుగా వాడాలి. మొక్కల్లో (తులసి మొక్క తప్ప) కలిపేయాలి. పిడకలైనా చేసుకోవచ్చు. ఆవు పేడ కచ్చితంగా ఉంచి దాని మీద విగ్రహం పెట్టి పూజ చేస్తేనే అద్భుత ఫలితాలు కలుగుతాయని గణేశ పురాణంలో చెప్పారు. పూజ పూర్తయ్యాక మట్టి గణపతిని నిమజ్జనం చేయాలి. అంటే పారే నీళ్లలో కలపాలి. లేదా మొక్కల్లో వేయాలి.

పూజ చేసే విధానం..

విగ్రహం పెట్టాలి. గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టాలి. 5 వత్తులు వేసి వెలిగించాలి. గణేశ పురాణం ప్రకారం రక్తాంబరం రక్తవర్ణం అంటుంది. అంటే గణపతి ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఎర్రటి వస్త్రాలు ధరించి ఉంటాడని గణేశ పురాణంలో ఉంది. ఎరుపు అంటే ఆయనకు మహా ప్రీతి. గణేశుడిని పూజించాలి అనుకునే వారు ముందుగా ఎర్ర పుష్పాలను సిద్ధం చేసుకోవాలి. ఎర్ర మందారం పూలు, ఎర్ర గులాబీలు ఇలా ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించాలి. అలాగే రెండు గరిక పోచలు కలిపి గణపతి విగ్రహం దగ్గర ఉంచాలి.

పూజలో ఈ రెండూ ఉండాల్సిందే..

గరిక పోచల జంట, ఎర్ర పూలతో గణపతిని పూజించాలి. గణపతి 108 నామాలు చదవాలి. అష్టోత్తరం మొత్తం చదవలేని వాళ్లు గం క్షిప్రప్రసాదనాయ నమ: మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవాలి. గణపతి పూజలో ఎర్ర పూలు, గరిక పోచలతో పాటు నేరేడు ఆకులు కూడా కొన్ని ఉంచాలి. దీని వల్ల గణేశుడు అనుగ్రహిస్తాడని గణేశ పురాణంలో చెప్పారు. ఇలా పూజ చేశాక హారతి ఇచ్చి నైవేద్యం పెట్టాలి. నైవేద్యంగా పాయసం పెట్టొచ్చు. రకరకాల పండ్లు, ఉండ్రాళ్లు పెట్టొచ్చు. నువ్వులతో చేసిన పదార్ధాలు కూడా సమర్పిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని గణేశ పురాణంలో చెప్పారు. సంకష్టహర చతుర్ధి వ్రతం చేసే వాళ్లు పూజలో కచ్చితంగా నేరేడు ఆకులు ఉంచాలి. నైవేద్యంలో నువ్వులతో చేసిన పదార్దాలు ఉంచాలి. అప్పుడు గణపతి అనుగ్రహిస్తాడని పండితులు చెబుతున్నారు.