హైదరాబాద్‌లో అద్భుతమైన ఆలయం.. స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చూశారా..? ఫుల్ డీటెయిల్స్..
ఆలయ నిర్మాణం, లోపల మూల విరాట్ లను దీపాల వెలుగుల్లో చూడటానికి రెండు కళ్ళు చాలవు. (Subrahmanya Swami Devalayam)
- Saketh U
- Published On : April 9, 2026 / 03:34 PM IST
Subrahmanya Swami Devalayam
Subrahmanya Swami Devalayam : హైదరాబాద్ లో కూడా ఎన్నో ఫేమస్ ఆలయాలు ఉన్నాయి. అద్భుతమైన కళా సంపద, ప్రశాంతత దొరికే ఆలయాలు కూడా చాలానే ఉన్నాయి. అందులో స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఇది సికింద్రాబాద్ దగ్గర పద్మారావు నగర్ లో ఉంది.
ఆలయ చరిత్ర..
1961లో కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి భక్తులు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆషాఢ కృత్తిక లక్షార్చన కమిటీ పేరుతో ఒక ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నారు. ఈ కమిటీ ప్రతి ఏటా సికింద్రాబాద్‌లోని ఆలయాల్లో సుబ్రహ్మణ్య స్వామికి చెందిన కృత్తిక ఉత్సవాన్ని జరిపేవారు. 1965లో చిదంబరంలో సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడి విగ్రహాలని తయారుచేయమని అక్కడి స్థపతికి ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు స్వామి వారు ఆలయ కమిటీలో ఒకరికి కలలోకి కూడా వచ్చారని సమాచారం. ఆ తర్వాత కొన్ని నెలలకు విగ్రహాలు అందినా సరైన స్థలం దొరక్కపోవడంతో ఆలయం ఆలస్యమైంది. శ్రీ కంచి కామకోటి పీఠం పరమాచార్య పూజ్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి 1968 ఏప్రిల్ నెలలో సికింద్రాబాద్ వచ్చినప్పుడు కమిటీ సభ్యులు వెళ్లి కలవగా పద్మారావునగర్‌లోని ఒక చిన్న కొండని చూసి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఆలయానికి అదే అనువైన ప్రదేశమని భావించి ఆ స్థల యజమానికి చెప్పడంతో ఆలయం కోసం ఆ భూమిని దానం చేసారు. 1968లో జగద్గురు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిచే శ్రీ సుందర వినాయగర్, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలకు శంకుస్థాపన జరిగింది. 1968 ఆగస్టులో మహా కుంభాభిషేకం చేసి ఆలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అదే ఆలయ ఆవరణలో పుష్పగిరి పీఠం జగద్గురు శంకరాచార్యుల వారి దివ్య సమక్షంలో 1973లో శ్రీ కామాక్షి అమ్మవారి, శ్రీ ఏకాంబరేశ్వర మరియు నవగ్రహ సన్నిధులను నిర్మించారు. అనంతరం శ్రీ జయ దుర్గా ఆలయాన్ని శ్రీదేవి – భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని, మిగిలిన ఆలయాలను స్థాపిస్తూ వచ్చారు.
ఆలయ నిర్మాణ శైలి..
ఈ ఆలయ నిర్మాణం అంతా కూడా తమిళనాడు, కేరళ శైలిలో ఉంటుంది. అక్కడి ఆలయాలు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ దేవతామూర్తుల పేర్లను కూడా తమిళ పేర్లతోనే పిలవడం గమనార్హం. అక్కడి ఆలయాల్లాగే గర్భగుడిలో దీపాల వెలుగులోనే మూల విరాట్ లను చూపిస్తారు. లోపల ఎంతో అందంగా నిర్మాణం చేసారు. ఆలయం చుట్టూ, లోపల, బయట, పైన భాగాలలో కూడా అద్భుతమైన శిల్పాలు చెక్కారు. ఈ ఆలయం నిర్మాణం అబ్బురపరుస్తుంది. ఆలయ నిర్మాణం, లోపల మూల విరాట్ లను దీపాల వెలుగుల్లో చూడటానికి రెండు కళ్ళు చాలవు.
స్కందగిరి ఆలయంలో ఉన్న మొత్తం ఆలయాలు..
ప్రధాన ఆలయం – వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం
ఉప ఆలయాలు – శ్రీ వినయాగర్(వినాయకుడు), శ్రీదేవి భూదేవి సమేత వరదరాజ స్వామి ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయం, దక్షిణామూర్తి, కామాక్షి దేవి ఆలయం, శివకామి సమేత నటరాజ ఆలయం, జయ దుర్గా దేవి ఆలయం, షణ్ముఖ స్వామి ఆలయం, నవగ్రహాలు, ఆది శంకరాచార్యుల విగ్రహం, భైరవ స్వామి ఆలయాలు ఉన్నాయి. అలాగే నవవీరుల విగ్రహాలు, కొన్ని దేవతల విగ్రహాల సన్నిధి ఏర్పాటు చేసారు. ఆలయం పైన ఓం సింబల్, వేల్ ఆయుధం తో లైటింగ్ వెలుగుల్లో పెద్ద ప్రతిమ ఏర్పాటు చేసారు.
ఈ ఆలయానికి ఆనుకొనే కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో హనుమంతుడి ఆలయం కూడా ఉంది. ఈ హనుమంతుడి విగ్రహం నిల్చొని పెద్ద సైజులో చూడటానికి సుందరంగా ఉంటుంది. అలాగే హనుమంతుడి ఆలయంలోనే ఆదిశంకరాచార్యుల పాదుకలు, చంద్రశేఖర సరస్వతి స్వామి వారి విగ్రహం, పలువురు కంచి కామకోటి పీఠాధిపతుల ఫొటోలు, సీతారామలక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు ఉన్నాయి.
ఈ ఆలయంలో జరిగే పూజలు, సేవలు..
ఈ ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు, ఇక్కడ ఉన్న అన్ని ఆలయాల్లోని దేవతల స్పెషల్ రోజుల్లో పూజలు నిర్వహిస్తారు. అన్ని రకాల ఆర్జిత సేవలు అందుబాటులో ఉన్నాయి. 200 కిలోల వెండితో 16 అడుగుల ఎత్తు గల ఒక వెండి రథం ఈ ఆలయంలో ఉంది. ముఖ్యమైన పండుగ రోజులలో ఉత్సవ దేవతామూర్తులను వెండి రథంలో ఊరేగిస్తారు. ఆ ఊరేగింపు చూడటానికి ఎంతో బాగుంటుంది. మంగళవారాలు, శుక్రవారాలు, పండుగ రోజులలో అన్ని దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయ బ్రహ్మోత్సవం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో (మే-జూన్) ఘనంగా జరుగుతుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంకటహర చతుర్థి, ఆది కృతిగై, సుబ్బరాయ షష్ఠి, మహాస్కంద షష్ఠి, తైపూసం.. లాంటివి ఘనంగా నిర్వహిస్తారు. ప్రతిరోజూ అభిషేకాలు, పూజలు సర్వ సాధారణం.
ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి రోజూ ఎంతో మంది భక్తులు వస్తారు. చాలా మంది ఈ ఆలయ పరిధిలో కూర్చొని ధ్యానం చేసుకుంటారు. ఈ ఆలయంలో ఫొటోలు, వీడియోలు నిషిద్ధం. అందుకే ఈ ఆలయం లోపల అద్భుతమైన నిర్మాణం చూడాలంటే అక్కడికి వెళ్లాల్సిందే. అన్ని దేవాలయాల్లో లాగా ఇక్కడ ప్రసాదం అమ్మరు. ఇక్కడ ఎవరికైనా ప్రసాదం ఉచితంగానే ఇస్తారు. మీరు కూడా ఈ ఆలయాన్ని మిస్ అవ్వకండి.
ఆలయం తెరిచి ఉంచే సమయం..
ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. మంగళవారం మాత్రం ఉదయం 5.30 గంటలకే తెరుస్తారు.
ఎలా వెళ్ళాలి..
సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పద్మారావు నగర్ కు, స్కందగిరికి ఆటోలు ఉంటాయి. లేదా ఓలా, ర్యాపిడో లాంటి ప్రైవేట్ ఆన్లైన్ బుకింగ్ చేసుకొని కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది.
