Sravana Masam 2026 : శ్రావణ మాసం వచ్చేసింది.. ఆగస్టు, సెప్టెంబర్‌లో శుభముహూర్తాల తేదీలు ఇవే.. ఈ మాసం ప్రత్యేకత ఏమిటి?
Sravana Masam 2026 : శ్రావణ మాసంలో శుభముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
- Harish Thanniru
- Published on- August 13, 2026 / 09:55 AM IST
sravana masam 2026
Sravana Masam 2026 : శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ మాసం పూజలు, వ్రతాలకు పెట్టింది పేరు. వీటికే పరిమితం కాకుండా శుభకార్యాలకూ అనువైనది. దక్షిణాయానం ప్రారంభమైన తరువాత వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండే మొదటి మాసమిది. ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు శ్రావణ మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజుల వ్యవధిలో వరుసగా శుభముహూర్తాలు ఉన్నాయి.
Also Read : Telangana : స్కూళ్లకు డుమ్మాకొట్టే టీచర్లకు బిగ్ షాక్.. విద్యాశాఖ సంచలన నిర్ణయం..
హిందూ సాంప్రదాయ పంచాంగంలో శ్రావణ మాసం ఐదవది. ఆషాఢ మాసం ముగిసిన వెంటనే పవిత్ర శ్రావణం ప్రారంభమవుతుంది. శ్రావణ పౌర్ణమి రోజున శ్రావణా నక్షత్రం పూర్ణచంద్రుడితో కూడి ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం కూడా శ్రావణా నక్షత్రమే కావడం ఈ మాసానికి మరింత ప్రాముఖ్యతను తెచ్చిపెడుతుంది. ఈ పవిత్ర మాసంలో శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహావిష్ణువు, పరమశివుడిని ఆరాధించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
శ్రావణ మాసంలో శుభముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పురోహితుల వివరాల ప్రకారం.. శ్రావణ మాసంలో ఆగస్టు 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30 తేదీల్లో శుభకార్యాలకు అనుకూలమైన మహుర్తాలు ఉన్నాయి. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో 3, 4, 5, 8, 10, 11 తేదీల్లో కూడా శుభ ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ శ్రావణ సీజన్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని పండితులు పేర్కొంటున్నారు.
ఇదిలాఉంటే.. శ్రావణ మాసం తరువాత భాద్రపదం శూన్యమాసం కావడం.. ఆశ్వీయుజ మాసంలో శుక్ర మౌఢ్య రావడంతో అక్టోబరు 29వ తేదీ వరకు ముహూర్తాలు లేవు. అందుకే చాలా మంది శ్రావణంలోనే వివాహాది శుభకార్యాలు జరిపించడానికి సిద్ధమవుతున్నారు.
13వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో.. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పవిత్రోత్సవాలు, తిరునక్షత్రాలు, భగవద్గీత పారాయణాలు, విష్ణఉ సహస్ర పారాయణాలు, శ్రీలలితా సహస్ర పారాయణాలు, కుంకుమ పూజలు నిర్వహించడానికి ఆలయాలను ముస్తాబు చేశారు.
