8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అలర్ట్.. DA ఫార్ములాపై కొత్త ట్విస్ట్.. భారీగా పెరగనున్న ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు!
8th Pay Commission : 8వ వేతన సంఘానికి ముందు డీఏ లెక్కింపు ఫార్ములాలో భారీగా మార్పులు చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగ సంఘాలు పెరిగిన కుటుంబ పరిమాణం, కొత్త ఖర్చులను చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. మార్పులు చేస్తే, జీతాలు, పెన్షన్లలో భారీగా పెరుగుదల ఉండొచ్చు.
- Sreehari A
- Published On : March 19, 2026 / 07:01 PM IST
8th Pay Commission ( Image Credit : Gemini AI )
- 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్
- డీఏ లెక్కింపు ఫార్ములా మారనుందా?
- జీతాలు, పెన్షన్లు భారీగా పెరగనున్నాయా?
- మార్చి 31వరకు సూచనలు, సలహాలు పంపొచ్చు
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. కరువు భత్యం (డీఏ) లెక్కించే సూత్రంలో మార్పులు చేయాలన్న డిమాండ్లు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC) సహా పలు ఉద్యోగ సంఘాలు, పెరుగుతున్న జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత వ్యవస్థను పునఃపరిశీలించాలని కేంద్రాన్ని కోరాయి.
జీతాలు, పెన్షన్లను నిర్ణయించే పద్ధతిని పునఃసమీక్షించాలని కోరాయి. అయితే, డీఏ ఫార్ములాలో మార్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 8వ వేతన సంఘం 18 ప్రశ్నల పత్రంపై సూచనలు సమర్పించే గడువును 2026 మార్చి 31 వరకు పొడిగించిన తరుణంలో ఈ అంశం తెరపైకి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలలో డీఏ అనేది ముఖ్యమైన భాగం. ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా సంవత్సరానికి రెండుసార్లు, జనవరి, జూలైలలో సవరిస్తారు. ప్రస్తుత ఫార్ములా ఇకపై వాస్తవ ఖర్చులను కచ్చితంగా అంచనా వేయడం లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లు ఏంటి? :
జీవన వ్యయం గణనీయంగా పెరిగింది. కానీ డీఏ (DA) లెక్కించే ప్రాతిపదిక మాత్రం చాలా వరకు అలాగే ఉందని ఉద్యోగుల సంఘాలు వాదిస్తున్నాయి. కుటుంబ పరిమాణంలో మార్పు తీసుకురావడమే ప్రధాన డిమాండ్. ప్రస్తుతం, ఈ ఫార్ములా ఒక కుటుంబాన్ని 3 వినియోగ యూనిట్లుగా పరిగణిస్తుంది. ఆధారపడిన తల్లిదండ్రుల వంటి ఖర్చులను కూడా చేర్చేందుకు ఐదుగురు సభ్యులకు పెంచాలని ఉద్యోగుల సంఘాలు కోరుతున్నాయి.
ప్రస్తుత డీఏ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే? :
పారిశ్రామిక కార్మికుల అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక (AICPI-IW) ఆధారంగా డీఏను లెక్కిస్తారు. ద్రవ్యోల్బణం ఆధారంగా శాతాన్ని నిర్ధారించి మూల వేతనానికి వర్తింపజేస్తారు. ప్రస్తుతం, జూలై 2025 నుంచి డీఏ 58 శాతంగా ఉంది.
జనవరి 2026 నాటికి 2 నుంచి 3 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా. దాంతో 60 శాతం లేదా అంతకంటే ఎక్కువకు చేరే అవకాశం ఉంది. డీఏ 50 శాతానికి మించితే కనీస వేతనంలో విలీనం చేయాలని ఉద్యోగుల సంఘాలు వాదిస్తున్నాయి. 2005లో ఐదో వేతన సంఘం సమయంలో ఇది జరిగింది. అయితే, ఈ పద్ధతిని కొనసాగించలేదు.
ఐక్రాయిడ్ ఫార్ములాపై చర్చ ఎందుకంటే? :
1957లో ఆమోదించిన ఐక్రాయిడ్ ఫార్ములాను కనీస వేతనాన్ని నిర్ణయించేందుకు ఇప్పటికీ ప్రాతిపదికగా ఉపయోగిస్తున్నారు. పోషణ, దుస్తులు, గృహవసతి వంటి ప్రాథమిక అవసరాలకు 2,700 కేలరీలను ప్రాతిపదికగా తీసుకుంటుంది.
ముగ్గురు సభ్యుల కుటుంబ నమూనాను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ విధానం ఇప్పుడు కాలం చెల్లిందని, ఆధునిక ఖర్చులు, మారుతున్న కుటుంబ నిర్మాణాలు, నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయాలను సరిగ్గా అంచనా వేయలేదని ఉద్యోగుల సంఘాలు అంటున్నాయి.
ఫార్ములా మారితే ఏమవుతుంది? :
ప్రభుత్వం డీఏ ఫార్ములాను మార్చితే.. జీతాలు, పెన్షన్లు భారీగా పెరగొచ్చు. గృహ వినియోగ యూనిట్ల సంఖ్యను 3 నుంచి ఐదుకు పెంచడం వల్ల కనీస వేతనం రూ. 18,000 నుంచి రూ. 30,000కు పైగా పెరగవచ్చు.
డీఏ అనేది మూల వేతనంలో ఒక శాతమే.. మూల వేతనం పెరిగితే డీఏ, పెన్షన్ రెండూ పెరుగుతాయి. అలాగే, జీతాల సవరణలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కూడా పెరగవచ్చు. ఫలితంగా మొత్తం జీతంలో 50 శాతం నుంచి 60 శాతం వరకు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇందులో సవాళ్లు ఏంటి? :
అయితే, ఈ డిమాండ్ల అమలు అంత ఈజీ కాదు. జీతాలు, పెన్షన్లు పెంపుతో ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా పెరగవచ్చు. అంతేకాదు.. నగరాలు, గ్రామాల మధ్య ఖర్చులు భారీగా మారుతూ వేళ దేశవ్యాప్తంగా వాస్తవ జీవన వ్యయాన్ని అంచనా వేయడం కష్టం. అందుకే ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక క్రమశిక్షణ మధ్య సమతుల్యతను పాటించాలి.
8వ పే కమిషన్ అమలు ఎప్పుడంటే? :
7వ వేతన సంఘం పదవీకాలం అధికారికంగా డిసెంబర్ 31, 2025న ముగిసింది. 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమలులోకి రావాల్సి ఉంది. అయితే, అధికారిక ఏర్పాటు, వివరణాత్మక నిర్మాణం ఇంకా ప్రకటించలేదు.
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, కనీస వేతనం, డీఏ విలీనం వంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఉద్యోగ సంఘాలు డిఏ ఫార్ములాలో మార్పు చేయాలనే డిమాండ్‌తో సహా నిరంతరం సూచనలు ఇస్తున్నాయి.
