8th Pay Commission : కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. రూ. 18 వేల నుంచి రూ. 69 వేలకు జీతాల పెంపు? భారీ ఇంక్రిమెంట్లు కూడా!
8th Pay Commission : 8వ వేతన సంఘం ముందు కీలక డిమాండ్ వినిపిస్తోంది. ఉద్యోగుల ప్రస్తుత కనీస మూల వేతనాన్ని రూ. 18,000 నుంచి రూ. 69,000కు పెంచాలి. అలాగే, ఏటా 6శాతం వేతన పెంపును కూడా డిమాండ్ చేస్తున్నారు.
- Sreehari A
- Updated on- April 17, 2026 / 03:22 PM IST
8th Pay Commission
- 8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
- కనీస వేతనాన్ని రూ. 18,000 నుంచి రూ. 69,000కు పెంచాలని డిమాండ్
- ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.83గా నిర్ణయించాలని డిమాండ్
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అతి భారీ గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్లు భారీ మొత్తంలో పెరగనున్నాయి.
ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లతో వినతిపత్రాన్ని 8వ వేతన సంఘానికి సమర్పించాయి. ఉద్యోగుల కనీస జీతాన్ని భారీగా పెంచాలని, అలాగే పెన్షన్ల నుంచి సెలవు విధానాల వరకు వివిధ రంగాలలో భారీ మార్పులను అమలు చేయాలని ఈ వినతిపత్రం సిఫార్సు చేస్తోంది.
వాస్తవానికి, 8వ వేతన సంఘం ఏర్పడినప్పటికీ అది ఇంకా అమల్లోకి రాలేదు. ఈ కమిటీ 18 నెలల్లోగా 8వ వేతన సంఘంపై రిపోర్టును (8th Pay Commission) సమర్పించాల్సి ఉంది. ఆ తర్వాతే అమలు చేయవచ్చు. 2027 మార్చి, ఏప్రిల్ మధ్య అమలు చేస్తారని భావిస్తున్నారు. అయితే, 2026 నుంచే అమలులోకి వచ్చినట్లుగా పరిగణిస్తారు. ఈలోగా, కమిషన్ ముందు కొన్ని డిమాండ్లు సమర్పించారు.
8వ వేతన సంఘం ముందుకు తెచ్చిన కొత్త డిమాండ్లను ఆమోదిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అలవెన్సులలో భారీ మొత్తంలో మార్పులు చోటుచేసుకోవచ్చు. నివేదిక ప్రకారం.. జాతీయ మండలి ముసాయిదా కమిటీ తుది ప్రతిపాదనను సమర్పించింది.
ఈ ప్రతిపాదనలు పెరుగుతున్న జీవన వ్యయాలు, కుటుంబ అవసరాలపై దృష్టి సారిస్తూనే అధిక ప్రాథమిక జీతాలు, మెరుగైన పెన్షన్లు మెరుగైన అలవెన్సులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఆ ప్రతిపాదనలు ఏమిటో పూర్తి వివరాలతో తెలుసుకుందాం..
కనీస మూల వేతనం రూ. 69వేలు :
ఈ డిమాండ్లన్నింటిలో ముఖ్యమైనది కనీస మూల వేతనాన్ని రూ. 69,000కు పెంచాలన్న డిమాండ్. కమిటీ 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సూచించింది. నివేదిక ప్రకారం.. ప్రస్తుత జీతం పెన్షన్‌లో భారీ పెరుగుదల ఉంటుంది. జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని సవరణలను ఆలస్యం లేకుండా అమలు చేయాలని కూడా కమిటీ డిమాండ్ చేసింది.
వార్షిక పెంపు ఎంత ఉండాలి?
వార్షిక ఇంక్రిమెంట్‌ను 6 శాతంగా నిర్ణయించాలనే మరో కీలకమైన డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. ప్రస్తుతం ఈ రేటు తక్కువగా ఉంది. ప్రతిఏటా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి 6 శాతం పెంపు తప్పనిసరి అని కమిటీ భావిస్తోంది.
ప్రస్తుత జీతాల నిర్మాణాన్ని సులభతరం చేయాలని కూడా కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఇందులో 18 విభిన్న స్థాయిలు ఉన్నాయి. ఇందులో కేవలం 7 విస్తృత స్థాయిలుగా ఏకీకృతం చేయాలని ప్రతిపాదించారు.
ఈ క్రమబద్ధీకరణ ఉద్యోగుల పదోన్నతులు పెరగనున్నాయి. కెరీర్ పురోగతికి ఎలాంటి ఆటంకం ఉండదు. ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం మిడ్ లెవల్ ఉద్యోగుల ప్రాథమిక జీతం రూ. 1.35 లక్షల నుంచి రూ. 2.15 లక్షల వరకు ఉండవచ్చు. ఒకమాటలో చెప్పాలంటే.. లెవల్స్ సంఖ్యను తగ్గించి ప్రతి లెవల్ ప్రారంభ జీతం తక్కువగా ఉండేలా మొత్తం జీతాల నిర్మాణాన్ని తిరిగి నిర్ణయించనున్నారు.
పెన్షన్ ఉద్యోగ ప్రయోజనాలు :
జనవరి 1, 2004 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలనేది ప్రధాన డిమాండ్లలో ఒకటి. పెన్షన్లను చివరిగా పొందిన జీతంలో 67శాతంగా, కుటుంబ పెన్షన్లను 50శాతంగా నిర్ణయించాలని కూడా కమిటీ ప్రతిపాదించింది. ప్రతి ఉద్యోగి 30 ఏళ్ల సర్వీసులోపు కనీసం 5 పదోన్నతులు లేదా జీతాల పెంపులను పొందాలని ఈ ముసాయిదా సిఫార్సు చేస్తుంది. అలాగే, ప్రతి ఐదేళ్లకు ఒకసారి పెన్షన్ సవరణ ఉంటుంది.
ఇంటి అద్దె భత్యం పెంచాలని డిమాండ్ :
ఈ రిపోర్టు ప్రకారం.. ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి అనేక కొత్త నిబంధనలను కూడా ప్రవేశపెట్టింది. ఇంటి అద్దె భత్యాన్ని (HRA) కనీసం 30శాతానికి పెంచాలని, మహానగరాల్లో నివసించే ఉద్యోగులకు ఇంకా ఎక్కువగా నిర్ణయించాలని సూచిస్తుంది. అలాగే, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు పరిహారాన్ని పెంచాలని, బీమా కవరేజీని మెరుగుపరచాలని డిమాండ్ వినిపిస్తోంది.
మహిళలకు ప్రసూతి సెలవును 240 రోజులకు పొడిగించాలని, తండ్రులైన పురుషులకు కూడా సెలవును పొడిగించే నిబంధనలను ప్రవేశపెట్టాలని డిమాండ్లు వ్యక్తమయ్యాయి. అయితే, తల్లిదండ్రుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా సెలవు కూడా కేటాయించాలని అభ్యర్థించారు.
ఈ ప్రతిపాదనను కేవలం ఒకే యూనియన్ సమర్పించింది. అంటే.. ఇది కేవలం ఒక సిఫార్సు మాత్రమే. కమిషన్ రిపోర్టు సమర్పించిన తర్వాతే అసలు నిర్ణయం తీసుకోనుంది. ఆపై జీతాలను ఎంత పెంచాలి అనేది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.
