Bank Holidays : బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు.. ఏమైనా పనులుంటే ముందే చేసుకొండి..
Bank Holidays : బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఈ వారంలో అంటే మార్చ 23-29 వరకు నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు రాబోతున్నాయి.
- Dharani Pilli
- Published On : March 23, 2026 / 11:58 AM IST
bank holidays 2026 this week from march 23 to march 29 details here
Bank Holidays : మార్చి నెలలో సాధారణంగానే సెలవులు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెలలో హోలీ, ఉగాది, రంజాన్, శ్రీరామనవమి వంటి పండుగలు రావడంతో పాటు సాధారణ సెలవులు అన్నీ కలుపుకుని భారీగానే సెలవులు వచ్చాయి. బ్యాంకులకు అయితే ఏకంగా 18 రోజుల వరకు సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో ఈ వారంలో అనగా మార్చి 23-29 వరకు మరోసారి బ్యాంకులకు వరుస సెలవులు రాబోతున్నాయి. కనుక నగదు విత్‌డ్రా, చెక్కుల క్లియరెన్స్ వంటి పనులు ఉంటే ముందే చక్కబెట్టుకోవడం మంచిది అంటున్నారు. పైగా ఈ వారంతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. దీంతో ఆర్థిక లావాదేవీలు స్తంభించిపోయే అవకాశం ఉంది. కనుక బ్యాంకులకు వెళ్లే పని ఉంటే ముందే పూర్తి చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
బ్యాంకు సెలవుల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జాబితా విడుదల చేసింది. దీనిలో భాగంగానే మార్చి నెలలో అత్యధికంగా 18 రోజులు సెలవులు వచ్చాయి. అలానే ఈ వారంలో అనగా 23 నుండి 29 మధ్య కాలంలో వరుసగా పండుగలు, వారాంతపు సెలవులు రావడంతో చాలా ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. మార్చి 26 గురువారం శ్రీరామనవమి.. దీంతో చాలా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. అలానే కొన్ని ప్రాంతాల్లో మార్చి 27న శ్రీరామనవమి జరుపుకుంటున్నారు. కనుక ఆ ప్రాంతాల్లో మార్చి 27న సెలవుగా ప్రకటించారు. అలానే మార్చి 28 నాలుగో శనివారం, మరుసటి రోజు ఆదివారం కావడంతో.. వరుసగా బ్యాంకులకు రెండు రోజులు సెలవులు వస్తున్నాయి.
ఇలా వరుస పెట్టి సుదీర్ఘ సెలవులు వస్తుండటంతో.. ఏటీఎంలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే బ్యాంకు బ్రాంచీలు మూసివేసినా.. డిజిటల్ సేవలు మాత్రం నిరంతరం అందుబాటులో ఉంటాయి. యూపీఐ ద్వారా జరిపే లావాదేవీలకు ఎలాంటి ఇబ్బంది లేదు. అత్యవసరంగా డబ్బులు పంపాలనుకునే వారు ఆన్‌లైన్ మార్గాలను వాడుకోవడం ఉత్తమం. బ్యాంకు సెలవులు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. వరుస సెలవుల నేపథ్యంలో మీ పనులకు ఆటంకం కలగకుండా ముందస్తు ప్రణాళిక వేసుకోవడం ఉత్తమం.
