Mobile Loan Default : EMI కట్టకపోతే మొబైల్ బ్లాక్?.. RBI కొత్త రూల్స్ వచ్చేశాయ్.. ఇలా చేస్తే గంటకు రూ.250 ఫైన్
Mobile Loan Default : కొత్త మొబైల్ కోసం లోన్ తీసుకుని ఈఎంఐ కట్టని వారి ఫోన్ పాక్షికంగా బ్లాక్ చేయొచ్చని, కానీ, అత్యవసర కాల్స్, ఇంటర్నెట్ సదుపాయం మాత్రం ఉండేలా చూడాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది.
- Sreehari A
- Updated on- May 21, 2026 / 04:38 PM IST
Mobile Loan Default ( Image Credit : AI )
- ఫోన్ ఈఎంఐ కట్టనివారికి ఆర్బీఐ గుడ్ న్యూస్..
- EMI బాకీ ఉన్నవారికి భారీ ఊరట.. మీ ఫోన్‌ని ఎవరూ పూర్తిగా బ్లాక్ చేయలేరు!
- ఇన్ కమింగ్, ఎమర్జెన్సీ కాల్స్, ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరిగా ఉంచాలి
- ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి
Mobile Loan Default : ఈఎంఐలో ఖరీదైన కొత్త ఆపిల్ ఐఫోన్ తీసుకున్నారా? మీరు సకాలంలో తిరిగి ఈఎంఐ చెల్లించలేదా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఇకపై బ్యాంకులు మీ ఫోన్ పూర్తిగా బ్లాక్ చేయలేవు. లోన్ రికవరీ కోసం మీరు తీసుకున్న ఫోన్ లోని కొన్ని ఫంక్షలను మాత్రమే బ్లాక్ చేయగలవు. ఇదే విషయాన్ని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసిన కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది.
ఆర్బీఐ ముసాయిదా నిబంధనల ప్రకారం.. రుణాలు తీసుకున్నవారు తిరిగి ఈఎంఐలు చెల్లించకపోతే ఆ ఫోన్ పూర్తిగా బ్లాక్ చేయరాదని ఆర్బీఐ ప్రతిపాదించింది. అంతేకాదు.. రికవరీ ఏజెంట్లు, బ్యాంకు ఉద్యోగులు రుణగ్రహీతలపై దూషించడం కూడా నిషేధమని ఆర్బీఐ పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఈఎంఐ కట్టడం ఆపేస్తే ఏమౌతుంది? :
ఆర్బీఐ సవరించిన ముసాయిదా ప్రకారం.. ప్రత్యేకించి ఈఎంఐలో మీరు ఏదైనా ఫోన్ కొనుగోలుచేస్తే ఆయా ఫోన్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఒకవేళ రుణగ్రహీత ఈఎంఐలు చెల్లించడం మానేసి, అకౌంట్ 90 రోజులకు పైగా అలానే పెండింగ్ ఉంటే రుణం తీసుకున్న ఫోన్ లోని కొన్ని ఫంక్షన్లను బ్లాక్ చేసేందుకు రుణదాతలకు అవకాశం ఉంటుంది. కానీ, ఫోన్ పూర్తిగా బ్లాక్ చేయలేరు.
ఇన్‌కమింగ్ కాల్స్, ఇంటర్నెట్ యాక్సెస్, ఎమర్జెన్సీ SOS ఫీచర్లు, ప్రభుత్వ హెచ్చరికలు వంటి అవసరమైన సేవలు పనిచేస్తూనే ఉండాలి. రుణదాతలు ఎంచుకున్న ఫోన్ ఫీచర్లను మాత్రమే బ్లాక్ చేయాల్సి ఉంటుంది. ఈ కింది షరతులను లోన్ అగ్రిమెంట్‌లోనే స్పష్టంగా పేర్కొనేలా రుణదాతలకు ఆర్‌బీఐ తప్పనిసరి చేసింది.
- మొబైల్ ఫోన్ కొనుగోలుకు బ్యాంకు లోన్ ద్వారా ఫైనాన్స్ చేసి ఉండాలి. లోన్ అగ్రిమెంట్‌లోనే ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి.
- లోన్ గడువు ముగిసి 60 రోజులు తర్వాత రుణగ్రహీతకు నోటీసు జారీ చేయాలి.
- డిఫాల్ట్‌ను క్లియర్ చేసేందుకు రుణగ్రహీతకు కనీసం 21 రోజుల సమయం ఇవ్వాలి.
- నోటీసు గడువు ముగిసిన తర్వాత రుణగ్రహీతకు మరో నోటీసు అందించాలి.
- అప్పటికీ లోన్ ఈఎంఐ కట్టకపోతే కనీసం మరో 7 రోజుల సమయం ఇవ్వాలి.
- లోన్ వసూలు లేదా మరే ఇతర ప్రయోజనాల కోసం బ్యాంకులు మొబైల్ ఫోన్ స్టోర్ చేసి డేటాను యాక్సెస్ చేయలేవు.
- ఆ ఫోన్ ఇతర అవసరాల కోసం ఉపయోగించలేవు.
రుణగ్రహీతల కోసం ముఖ్యమైన విషయాలివే :
బ్యాంకులు మొబైల్ లోన్ తీసుకున్న రుణగ్రహీత మొబైల్ ఫోన్ ఫంక్షనాలిటీని పాక్షికంగా నిలిపివేసేందుకు ఏదైనా టెక్ ఆధారిత టూల్ వాడితే ఒకేసారి ఫోన్ ఫంక్షనాలిటీని బ్లాక్ చేయొద్దు. ఇంటర్నెట్ సదుపాయం, ఇన్‌కమింగ్ కాల్స్, ఎమర్జెన్సీ SOS, ఎమర్జెన్సీ ప్రభుత్వ లేదా ప్రజా-భద్రతా నోటిఫికేషన్‌లను పొందడం వంటి అవసరమైన సర్వీసులను బ్లాక్ చేయకూడదు.
Read Also : iQOO 15T Launch : కొత్త ఐక్యూ 15T అదుర్స్.. గేమింగ్, ఫొటోగ్రఫీ, బ్యాటరీ బ్యాకప్ అన్నీ ఒకే ఫోన్‌లో!
బ్యాంకులే గంటకు రూ. 250 చెల్లించాలి? :
అలాగే, రుణగ్రహీత డిఫాల్ట్‌ను క్లియర్ చేయడానికి గంట ముందు ఏ సందర్భంలోనైనా డివైజ్ ఫంక్షనాలిటీలపై లిమిట్స్ వెంటనే బ్యాంకులు ఎత్తేయాలి. మొబైల్ లిమిట్స్ ఎత్తివేయడంలో బ్యాంకు ఆలస్యం చేసినా, రుణగ్రహీత రుణం తిరిగి చెల్లించినా ఫోన్ అన్ బ్లాక్ చేయకపోతే సదరు బ్యాంకులు రుణగ్రహీతకు గంటకు రూ. 250 చొప్పున నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
రుణం పూర్తిగా తిరిగి చెల్లించిన వెంటనే మొబైల్ ఫంక్షనాలిటీని బ్లాక్ చేసేందుకు వాడిన టూల్ రిమూవ్ చేయాలి. ఏ దశలోనైనా పాక్షికంగా లేదా పూర్తిగా రుణాన్ని ముందుగానే చెల్లించే హక్కు రుణగ్రహీతకు ఉంటుంది.
రుణ వసూలు, బ్యాంకు ఏజెంట్ల ప్రవర్తనపై కఠినమైన నియమాలివే :
బ్యాంకు ఉద్యోగి గానీ, కేంద్ర బ్యాంకు ఆదేశించిన రికవరీ ఏజెంట్ గానీ, రుణ వసూలు విషయంలో ఎలాంటి కఠినమైన పద్ధతులను అనుసరించకూడదని ఆర్‌బిఐ నిబంధనల్లో పేర్కొంది.
- బెదిరింపు లేదా దూషపూరిత భాషను వాడటం
- వీడియో / ఆడియో రికార్డింగ్‌లు, రుణగ్రహీత వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం
- మొబైల్‌లో లేదా సోషల్ మీడియా ద్వారా అనుచిత మెసేజ్ పంపడం
- రుణగ్రహీతకు అధికంగా కాల్ చేయడం, మెసేజ్ పంపడం లేదా సమయంతో సంబంధం లేకుండా ఇంటి వద్దకు వెళ్లి వేధించడం
- బెదిరింపులకు పాల్పడుతూ అన్ నౌన్ కాల్స్ చేయడం
- రుణగ్రహీత, వారి బంధువులు, మధ్యవర్తులు, స్నేహితులు లేదా సహోద్యోగులను మాటలతో శారీరకంగా లేదా మరే ఇతర పద్ధతిలోనైనా భయపెట్టడం లేదా వేధించడం
- రుణగ్రహీతకు హాని కలిగించడం, హింస లేదా అలాంటి ఇతర మార్గాలను ఉపయోగించడం లేదా అలా చేస్తామని బెదిరించడం
- రుణగ్రహీత రుణం మొత్తం తిరిగి చెల్లించకపోతే కలిగే పరిణామాల గురించి తప్పుదారి పట్టించే వాస్తవాలను చెప్పి బెదిరించడం
బ్యాంకు తమ రికవరీ ఏజెన్సీల యాక్టివిటీలను మానిటరింగ్ చేసేందుకు లేదా కంట్రోల్ చేసేందుకు ఒక మేనేజ్ మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. బ్యాంకు సమగ్రతకు, ప్రతిష్టకు నష్టం కలిగించే చర్యలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. రికవరీ ఏజెన్సీతో కుదుర్చుకున్న ఒప్పందంలో అవసరమైన నిబంధనలు ఉండేలా బ్యాంకు నిర్ధారించుకోవాలని ఆర్‌బిఐ తెలిపింది.
