Diwali Gift Tax Rules 2026 : కంపెనీ దీపావళి గిఫ్ట్ ఇచ్చిందని సంబరపడకండి.. రూ.15 వేలే లిమిట్.. ఒక్క రూపాయి దాటినా ట్యాక్స్!

Diwali Gift Tax Rules 2026 : దీపావళి సందర్భంగా కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే గిఫ్ట్‌లపై కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రూ.15వేలు గిఫ్ట్ లిమిట్, బోనస్ ట్యాక్స్, టీడీఎస్ నిబంధనల పూర్తి వివరాలివే..

Diwali Gift Tax Rules 2026

  • కంపెనీ గిఫ్ట్ ఇస్తే తీసుకుంటున్నారా? రూ. 15వేలు లిమిట్ దాటితే పన్ను కట్టాలి
  • 2026-27 పన్ను సంవత్సరం నుంచి ఈ కొత్త పన్ను నిబంధనలు వర్తిస్తాయి
  • దీపావళి బోనస్, గిఫ్ట్‌లపై ఐటీ శాఖ కన్ను.. ఉద్యోగులు ఈ రూల్స్ తెలుసుకోండి

Diwali Gift Tax Rules 2026 : దీపావళి వచ్చిందంటే చాలు.. ఉద్యోగులకు కంపెనీల నుంచి గిఫ్టులు, గిఫ్ట్ వోచర్లు, బోనస్‌లు అందుతుంటాయి. అయితే, పండుగకు వచ్చిన ఈ బహుమతులపై కూడా ఆదాయపు పన్ను పడుతుందని మీకు తెలుసా? అవును మీరు చదివింది నిజమే..

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. కంపెనీలు ఇచ్చే గిఫ్ట్‌లపై నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే (Diwali Gift Tax Rules 2026) పన్ను మినహాయింపు ఉంటుంది. ఆ లిమిట్ దాటితే మాత్రం ట్యాక్స్ కట్టాల్సిందే.. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

రూ.15 వేల వరకు ట్యాక్స్ ఫ్రీ.. :
ఇప్పటివరకు ఉద్యోగులకు యాజమాన్యాలు ఇచ్చే గిఫ్ట్‌లపై ఏడాదికి రూ.5వేల వరకు పన్ను మినహాయింపు ఉండేది. అయితే, 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఆదాయపు పన్ను చట్టం 2025 ప్రకారం.. ఈ పరిమితిని రూ.15వేలకు పెంచారు. అంటే.. 2026-27 పన్ను సంవత్సరం నుంచి కొత్త నిబంధనలు వర్తిస్తాయి.

ఉద్యోగికి ఒక ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఇచ్చే బహుమతుల మొత్తం విలువ రూ.15వేల కన్నా తక్కువగా ఉంటే పన్ను ఉండదు. ఈ పరిమితిలో ఫిజికల్ గిఫ్ట్స్, గిఫ్ట్ వోచర్లు, టోకెన్లు, డిజిటల్ గిఫ్ట్ కార్డులు కూడా ఉంటాయి. ఉద్యోగి కుటుంబ సభ్యులకు కంపెనీ ఇచ్చే బహుమతులకూ ఇదే నిబంధన వర్తిస్తుంది..

Read Also : Mukesh Ambani Net Worth : ఒక్క దెబ్బతో సీన్ రివర్స్.. ఆసియా సంపన్నుల జాబితాలో ముఖేశ్ అంబానీ టాప్!

అయితే, గిఫ్ట్‌ల మొత్తం వాల్యూ రూ.15వేలకు చేరినా, దాటినా జాగ్రత్తగా ఉండాలి.. మొత్తం బహుమతుల విలువను పన్ను పరిధిలోకి వచ్చే జీతభత్యాలుగా పరిగణిస్తారు. ఉదాహరణకు.. ఒక ఏడాదిలో రూ.10వేల విలువైన గిఫ్ట్‌తో పాటు మరో రూ.5వేలు గిఫ్ట్ అందుకున్నా మొత్తం రూ.15వేలపై పన్ను వర్తిస్తుంది.

బోనస్‌కు ఈ మినహాయింపు లేదు :

మరో ముఖ్యమైన విషయం తెలుసా? దీపావళి సందర్భంగా కంపెనీ ఇచ్చే బోనస్, జీతంలో భాగంగా ఇచ్చే నగదు ప్రోత్సాహకాలకు రూ.15వేలు గిఫ్ట్ మినహాయింపు వర్తించదు. అందులో మొదటి రూపాయి నుంచే జీతంగా పరిగణించి పన్ను విధిస్తారు. అయితే, ఎలాంటి ప్రతిఫలం లేకుండా ఇచ్చే నగదు బహుమతులపై పన్ను విధానం వేరుగా ఉండవచ్చు.

టీడీఎస్ విషయంలోనూ జాగ్రత్త :
గిఫ్ట్‌లపై పన్ను వర్తిస్తే.. కంపెనీ ఉద్యోగి జీతంలో ఆ మొత్తాన్ని కలిపి టీడీఎస్ లెక్కిస్తుంది. సాధారణంగా పన్ను మొత్తాన్ని నెలవారీ జీతం నుంచి అడ్జెస్ట్ చేయవచ్చు. అందుకే గిఫ్ట్ వాల్యూ, బోనస్ వివరాలను పేస్లిప్‌లో, వార్షిక పన్ను వివరాల్లో చెక్ చేసుకోవాలి..

పన్ను లెక్కల్లో తేడాలుంటే.. కంపెనీ హెచ్‌ఆర్ లేదా ట్యాక్స్ నిపుణుడిని సంప్రదించాలి. ఈ దీపావళికి గిఫ్ట్ అందుకునే ముందు విలువతో పాటు ఏడాదిలో ఇప్పటివరకు అందుకున్న బహుమతుల మొత్తాన్ని కూడా లెక్కలేసుకోవడం బెటర్..