E20 Dispute : E-20 కేసులో మారుతీకి ఎదురుదెబ్బ.. కొత్త కారు ఇవ్వాలన్న ఆదేశం! కంపెనీ సవాల్‌కు రెడీ!
E20 Dispute : ఇ20 వివాదంలో మారుతి సుజుకికి బిగ్ షాక్ తగిలింది. గ్రాండ్ విటారా కారులో సమస్యలన్నాయంటూ ఓ వినియోగదారుడు కోర్టును ఆశ్రయించడంతో కొత్త కారు ఇవ్వాల్సిందేనంటూ ఆదేశించింది.
- Sreehari A
- Published on- July 17, 2026 / 07:07 PM IST
E20 Dispute
- మారుతీ వర్సెస్ కస్టమర్.. E-20 వివాదంలో అసలు ట్విస్ట్ ఇదే!
- ఇ-20 వివాదంలో మారుతీకి గట్టి దెబ్బ.. కస్టమర్‌కు కొత్త కారు ఇవ్వాల్సిందేనా?
- 45 రోజుల్లో కొత్త కారును ఇవ్వాలంటూ వినియోగదారుల కమిషన్ ఆదేశాలు
E20 Dispute : ఇ-20 ఇంధనంతో నడిచే కార్లలో నిజంగా సమస్యలు వస్తాయా? ఇ-20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా చర్చల నేపథ్యంలో మారుతీ సుజుకీకి సంబంధించి కీలక పరిణామం తెరపైకి వచ్చింది. ఇ-20 ఇంధనంతో నడిచే గ్రాండ్ విటారా కారులో అనేక సమస్యలు తరచూ వస్తున్నాయంటూ ఓ వినియోగదారుడు వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదుపై విచారించిన రాయ్‌పుర్ జిల్లా వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు ఇచ్చింది. బాధితుడికి కొత్త వాహనం తిరిగి ఇవ్వాలని లేదా కారు ధరతో పాటు ఇతర ఖర్చులను చెల్లించాలని మారుతీ సుజుకీని కోర్టు ఆదేశించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2023 జనవరిలో మారుతి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ జెటా ప్లస్ మోడల్ తయారైంది. ఈ కారును 2024 జూన్‌లో ఓ వినియోగదారుడు కొనుగోలు చేశాడు. అయితే, ఈ కారు కొన్న 5 నెలలకే పర్ఫార్మెన్స్ మందగించింది. పదేపదే సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దాంతో అతడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.
Read Also : Lenovo Legion Laptop : గేమింగ్ బీస్ట్ వచ్చేసింది.. ప్రపంచంలోనే ఫస్ట్ IJP OLED గేమింగ్ ల్యాప్‌టాప్!
45 రోజుల్లోగా కొత్త కారు ఇవ్వాలి :
దీనిపై విచారించిన కమిషన్ 45 రోజుల్లో కొత్త కారును ఇవ్వాలని మారుతీని ఆదేశించింది. లేదంటే రూ.20.50 లక్షల వాహన ధరతో పాటు ఆర్‌టీఓ, బీమా ఖర్చులను సైతం తిరిగి చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాదు.. ఈ క్రమంలో వినియోగదారుడు ఎదుర్కొన్న మానసిక ఇబ్బందులకు పరిహారంగా రూ.లక్ష, న్యాయపరమైన ఖర్చుల కోసం మరో రూ.10 వేలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది.
అయితే, ఈ తీర్పును మారుతీ సుజుకీ సవాల్ చేయనుంది. ఈ ఆదేశాలను ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. గ్రాండ్ విటారా ఇ-20 పెట్రోల్‌కు పూర్తిగా అనుకూలంగా ఉందని, అన్ని వివరాలు ఓనర్ మాన్యువల్‌లో క్లియర్ గా రాసి ఉన్నాయని పేర్కొంది.
అంతేకాదు.. వాహనంలో సమస్యలకు కల్తీ ఇంధనమే కారణమై ఉండొచ్చని, అందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇ-20 ఇంధనం, వాహన క్వాలిటీపై జరుగుతున్న చర్చల మధ్య ఈ కేసు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
